కొత్తకోట: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులైన చక్కెర, ఉల్లిగడ్డ, మంచి నూనె, ఉప్పు, గోధుమలు, పిండి తదితర వాటిని వినియోగదారులకు రాయితీపై ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక సమస్యలను పాలకులు పట్టించుకోవడం లేదని.. నిత్యం రద్దీగా ఉండే ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యాలు లేవని, మరుగుదొడ్లు లేవని, దుర్వాసన వెదజల్లుతుందన్నారు. పట్టణంలోని ప్రతి సమస్యను పరిష్కరించే వరకు పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గసభ్యులు ఎండీ జబ్బార్, బాల్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు మండ్ల రాజు, మండల కార్యదర్శి బొబ్బిలి నిక్సన్ తదితరులు పాల్గొన్నారు.
పునరావాస కేంద్రంలో పనుల అడ్డగింత
కొత్తకోట రూరల్: మండలంలోని కానాయపల్లి పునరావాస కేంద్రంలో నిర్మాణాలు నాసిరకంగా చేపడుతున్నారని ఆరోపిస్తూ ఆదివారం గ్రామస్తులు పనులు అడ్డుకున్నారు. కాంట్రాక్టర్ పర్యవేక్షణ లోపంతో పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కలెక్టర్ ఆదర్శ్ సురభి పునరావాస కేంద్రాన్ని సందర్శించి పనులు నాణ్యతగా, వేగంగా పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్‌కు సూచించినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదన్నారు. సర్వం కోల్పోయి పునరావాస కేంద్రానికి వచ్చిన తమకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు ఎంతో ముఖ్యమని, అలాంటి నిర్మాణాలను నాణ్యతతో పూర్తి చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని తెలిపారు. ఒకవైపు అధికారులు గ్రామాభివృద్ధికి చర్యలు చేపడుతుండగా.. మరోవైపు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. ఇప్పటికై నా కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టి పనులు నాణ్యతగా పూర్తి చేయించాలని కోరారు. గ్రామస్తుల నిరసనతో కొంతసేపు పనులు నిలిచిపోయాయి. కార్యక్రమంలో గ్రామస్తులు భీమన్ననాయుడు, కావలి రవి, మొగులయ్య, గాంధీ, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.


