ప్రతిభకు ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

ప్రతిభకు ప్రోత్సాహం

Aug 30 2026 12:39 AM | Updated on Aug 30 2026 12:39 AM

సద్వినియోగం చేసుకోవాలి..

విద్యార్థులు ఈ సదావకాశాన్ని వినియోగించుకొని దరఖాస్తు చేసుకోవాలి. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ ఉపకార వేతనం ఎంతో అవసరం. ప్రణాళికతో చదివితే విజయం సాధించవచ్చు. గతంలో కంటే ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఎంపికయ్యేటట్లు కృషి చేస్తాం.

– డా. గోవిందరాజు, జిల్లా విద్యాధికారి

పేద విద్యార్థులకు ఉపయోగకరం..

ఆర్థికంగా వెనకబడ్డ మాలాంటి పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ ఎంతగానో ఉపయోగపడుతోంది. ఉపాధ్యాయుల సహకారంతో చక్కగా చదివి ఎన్‌ఎంఎంఎస్‌ ఉత్తీర్ణత సాధించా. ఏటా ప్రభుత్వం ఇచ్చే పారితోషికం నా చదువుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తోటి మిత్రులు ఈ సదావకాశాన్ని వినియోగించుకొని స్కాలర్‌షిప్‌ అందుకోవాలని కోరుకుంటున్నా. – అజయ్‌, కోటకొండ పీఎంశ్రీ స్కూల్‌

నారాయణపేట ఎడ్యుకేషన్‌: పేద విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహాన్నిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రతిభ ఉపకార వేతనం (ఎన్‌ఎంఎంఎస్‌) అందిస్తోంది. 2026–27 విద్యాసంవత్సరానికిగాను అర్హత పరీక్ష ప్రకటన ఇప్పటికే విడుదల కాగా.. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్‌ 1వ తేదీతో ముగియనుంది. నవంబర్‌ 1న జిల్లాకేంద్రంలో ఎంపిక పరీక్ష విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఎంపికై న విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు అంటే నాలుగేళ్ల పాటు ఏటా రూ.12 వేల చొప్పున మొత్తం రూ.48 వేలు వారి బ్యాంకు ఖాతాలో జమ కానున్నాయి.

అర్హతలు..

ప్రభుత్వ, ఎయిడెడ్‌, స్థానిక సంస్థలు, హాస్టల్‌ సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. 2025–26 విద్యా సంవత్సరంలో 7వ తరగతిలో 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలైతే 50 శాతం మార్కులున్నా సరిపోతుంది. 2026–27 విద్యా సంవత్సరంలో రెగ్యులర్‌ విద్యార్థి అయి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3.50 లక్షలలోపు ఉండాలి. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రధానోపాధ్యాయులు ధ్రువీకరిస్తూ బోనాఫైడ్‌ ఇవ్వాలి. గురుకులాలు, రెసిడెన్షియల్‌, నవోదయ, కేంద్రీయ, ప్రైవేట్‌ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అనర్హులు.

ఎంపిక విధానం..

రాష్ట్రస్థాయి పరీక్ష ఆధారంగా మెరిట్‌ సాధించిన విద్యార్థులను స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు. మొత్తం రెండు పేపర్లు నిర్వహిస్తారు. మొదటిది మెంటలబిలిటీకి సంబంధించినది.. ఇందులో మొత్తం 90 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 90 మార్కులు. రెండోది స్కాలాస్టిక్‌ అప్టిట్యూట్‌ టెస్ట్‌. 7, 8వ తరగతి గణితం, సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 90 మార్కులు. రెండు విభాగాల్లో కలిపి మొత్తం 180 మార్కులు ఉంటాయి. సమయం 3 గంటలు. ఎలాంటి నెగిటివ్‌ మార్కులు ఉండవు.

నవంబర్‌ 1న ఎన్‌ఎంఎంఎస్‌ ఎంపిక పరీక్ష

ఎంపికై న విద్యార్థులకు ఏటా రూ.12 వేల ఉపకార వేతనం

దరఖాస్తునకు సెప్టెంబర్‌ 1 వరకు అవకాశం

దరఖాస్తు విధానం..

విద్యార్థులు స్వయంగా కాకుండా పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం దరఖాస్తు ప్రింట్‌, అవసరమైనా ధ్రువీకరణ పత్రాలు, సంబంధిత జిల్లా విద్యాధికారికి సమర్పించాలి. మరింత సమాచారం కోసం httpr://www. bre.teanfana.gov.in/ NMM .arpx వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement