● మహానీయుల స్ఫూర్తివేదిక ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ కేడీఆర్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన్‌చంద్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం స్ఫూర్తివేధిక రాష్ట్ర చైర్మన్ రాజారాంప్రకాశ్ మాట్లాడుతూ.. గ్రామీణ మూలాలకు సంకేతమైన కబడ్డీ, ఖో–ఖో, జాతీయ క్రీడ హాకీ వంటివి క్రమంగా కనుమరుగవుతున్నాయని, నేటి యువత ఆయా సాంప్రదాయ క్రీడలపై ప్రత్యేక ఆసక్తి పెంచుకొని వాటికి పూర్వవైభవం తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో గిరిరాజాచారి, డా. నాయకంటి నర్సింహశర్మ, గంధం నాగరాజు, బాలేమియా, చింతకుంట కురుమయ్య, ఇటిక్యాల బండలయ్య, మహేష్, ప్రముఖ న్యాయవాది ఉత్తరయ్య, డా. విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వనపర్తిటౌన్: నేటి ఆధునిక యుగంలో యువత ఎక్కువగా స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా, వర్చువల్ ప్రపంచానికే పరిమితమవుతున్నారని.. శారీరక శ్రమ పూర్తిగా తగ్గడంతో చిన్న వయసులోనే తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళన, శారీరక రుగ్మతలకు గురవుతున్నారని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. బి.ఈశ్వరయ్య అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని కళాశాల ప్రాంగణంలో స్పోర్ట్స్ కన్వీనర్ జి.యువ రూపలక్ష్మి ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ అధ్యక్షతన జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా భారత హాకీ దిగ్గజం, విజార్డ్ ఆఫ్ హాకీ మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా క్రీడల్లోనూ విశేషంగా రాణించినప్పుడే సమగ్ర వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందన్నారు. రోజువారీ జీవితంలో క్రీడలను భాగం చేసుకోవాలని.. అభిరుచికి తగ్గట్టుగా ఇండోర్, అవుట్‌డోర్ గేమ్‌ల్లో ఏదో ఒకదానిని ఎంచుకొని క్రమం తప్పకుండా ఆడటంతో మానసిక ప్రశాంతతతో పాటు ఏకాగ్రత, నిర్ణయాత్మక శక్తి పెరుగుతాయని వివరించారు. క్రీడలు కేవలం శారీరక ఆరోగ్యాన్నే కాకుండా ఓటమిని తట్టుకునే సహనాన్ని, గెలుపు వైపు నడిపించే నాయకత్వ లక్షణాలను, సమష్టి సమన్వయాన్ని నేర్పుతాయన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీరామరాజు యాదవ్, స్పోర్ట్స్ కో–కన్వీనర్ డాక్టర్ కె.విజయలక్ష్మి, అధ్యాపకులు డాక్టర్ పోతురాజు శ్రీనివాస్, డాక్టర్ జి.సుష్మ, స్రవంతి, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.


