వీపనగండ్ల: మండలంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులపై సోమవారం మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ, సర్పంచ్ పార్వతమ్మ, ఉపసర్పంచ్ బాలపీరు శనివారం తెలిపారు. జిల్లా, డివిజన్, మండలస్థాయి అధికారులు సమావేశంలో పాల్గొంటారని.. మండలంలో నెలకొన్న సమస్యలను వాట్సప్ నంబర్ 81858 85127లో తెలియజేయాలని పేర్కొన్నారు. సమీక్ష సమావేశంలో అధికారులతో మంత్రి ఆయా సమస్యలపై చర్చిస్తారని చెప్పారు. మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
రెండు యూనిట్లల్లోవిద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల జలాశయం దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. శనివారం ఎగువన 1 యూనిట్ నుంచి 39 మెగావాట్లు, 94.123 మి.యూ., దిగువన 1 యూనిట్ నుంచి 40 మెగావాట్లు, 79.015 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్టు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఇప్పటి వరకు 173.138 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు.
గోపల్‌దిన్నెలో డెంగీ కేసు నమోదు
వీపనగండ్ల: మండలంలోని గోపల్‌దిన్నెలో కుర్మయ్య అనే వ్యక్తికి డెంగీ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో శనివారం వైద్యులు బాధితుడి ఇంటి పరిసరాల్లోని ఇళ్ల వారి నుంచి రక్త నమూనాలు సేకరించారు. ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. దోమల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మండల వైద్యాధికారి రాజశేఖర్, సర్పంచ్ కవిత గ్రామస్తులకు వివరించారు. జ్వరంతో బాధపడుతున్న 20 మంది నుంచి రక్త నమూనాలు సేకరించినట్లు తెలిపారు. ఆయుష్ వైద్యురాలు డా. శ్వేత, వైద్యసిబ్బంది రవీందర్, రవికుమార్, పలువురు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
భీమా కాల్వలోపూడిక తొలగింపు
పాన్‌గల్: మండలంలోని బుసిరెడ్డిపల్లి గ్రామం బొల్లిగట్టు సమీపంలోని డిస్ట్రిబ్యూటరీ 23లో పేరుకుపోయిన పూడిక, జమ్ము తొలగింపు పనులను శనివారం యంత్రాలతో చేపట్టారు. శుక్రవారం మండల కేంద్రంలో మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్వహించిన సమీక్షలో గ్రామానికి చెందిన పలువురు రైతులు సమస్యను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. కాల్వలో పేరుకపోయిన పూడిక తొలగింపు పనులు వెంటనే చేపట్టాలని మంత్రి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో శనివారం అధికారులు పనులు ప్రారంభించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
శనేశ్వరుడికి
ప్రత్యేక పూజలు
కందనూలు: నందివడ్డేమాన్ జ్యేష్ఠాదేవి సమేత శనేశ్వరుడికి శనివారం ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ శనిదోష నివారణార్థం ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథ శాసీ్త్ర వేద మంత్రోచ్ఛరణల మధ్య శనేశ్వరుడికి తిల, తైలాభిషేకాలు నిర్వహించారు. ప్రతి ఒక్కరు జన్మరీత్యా, గోచార రీత్యా శనిగ్రహ దోష నివారణకు స్వామివారిని శక్తిమేరకు పూజించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్‌రావు, సర్పంచ్ సుగుణమ్మ పాల్గొన్నారు.


