అమరచింత: రైతులకు సాగునీటిని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ వైస్ చైర్మన్ కేశం నాగరాజ్‌గౌడ్ అన్నారు. మండలంలోని ధర్మాపురం శివారులోని భూత్పూరు కాల్వలను శనివారం గ్రామ రైతులతో కలిసి పరిశీలించారు. కాల్వలో జమ్ము, ముళ్లపొదలు పెరిగాయని.. సాగునీరు సరఫరా కావడం లేదని చెప్పడంతో సమస్యను వెంటనే మంత్రి వాకిటి శ్రీహరికి ఫోన్‌లో వివరించారు. ముళ్లపొదల తొలగింపునకు నిధులు మంజూరు చేస్తామని చెప్పడంతో వెంటనే అధికారులతో మాట్లాడి చెత్తతో పాటు జమ్మును తొలగించాలన్నారు. భూత్పూర్ కాల్వలతో పాటు ఎత్తిపోతల ద్వారా రైతులకు నిరంతరం సాగునీరు అందించేందుకు మంత్రి కృషి చేస్తున్నారని వెల్లడించారు. అన్నదాతలను ఆదుకోవడమే తమప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, డీసీసీ కార్యదర్శి రమేష్, అమరచింత పట్టణ కార్యదర్శి రవికాంత్, జింక రవి తదితరులు పాల్గొన్నారు.


