వనపర్తి: ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్, జెడ్పీ సీఈఓ యాదయ్య, శిక్షణ కలెక్టర్ శ్రావ్యతో కలిసి హాజరై అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి పరిశీలించారు. వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు సిఫారస్ చేశారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం భోజన విరామ సమయం వరకు జరగగా.. మొత్తం 44 అర్జీలు దాఖలైనట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. అదేవిధంగా ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ప్రజావాణికి 11 వినతులు వచ్చినట్లు ఆర్డీఓ సుబ్రమణ్యం తెలిపారు.


