జిల్లాలో పురాతన విగ్రహాలు, శిలాశాసనాలకు రక్షణ కరువు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో పురాతన విగ్రహాలు, శిలాశాసనాలకు రక్షణ కరువు

Jul 6 2026 12:22 AM | Updated on Jul 6 2026 12:22 AM

దశాబ్దాలుగా

నిరాధరణకు

గురవుతున్న వైనం

చారిత్రక ఆలయాల సంరక్షణ సైతం

పట్టని యంత్రాంగం

టూరిజం సర్క్యూట్‌ నిధులు మంజూరై ఏడాదైనా కానరాని పురోగతి

కొల్లాపూర్‌: ఉమ్మడి జిల్లాలోని పలు దేవాలయాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. భవిష్యత్‌ తరాలకు చరిత్రను తెలియజెప్పే శాసనాలను సైతం ఈ ప్రాంతంలో గుర్తించారు. కానీ, వాటిని పూర్తిస్థాయిలో పరిరక్షించడంలో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తోంది. చారిత్రక ఆలయాలు, పురాతన దేవతామూర్తుల విగ్రహాలు, శిలాశాసనాల రక్షణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నా.. ప్రభుత్వ యంత్రాంగం మాత్రం వివిధ కారణాలతో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.

ప్రాభవం కోల్పోతున్న జటప్రోల్‌..

కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని జటప్రోల్‌ సమీపంలో కృష్ణానది తీరాన కొన్ని శతాబ్దాల క్రితం సురభి రాజులు అద్భుతమైన శిల్పకళతో మధనగోపాలస్వామి ఆలయం నిర్మించారు. రాజుల పాలనలో ఈ ఆలయంలో ప్రతిఏటా నెల రోజులపాటు జాతర సాగేది. అయితే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంతో ఆలయం నీటిలో మునిగిపోవడంతో తర్వాతి కాలంలో జటప్రోల్‌లో పునర్నిర్మించారు. కొన్నేళ్లపాటు పూజలు యథాతథంగా సాగినా.. కాలక్రమంలో ఈ ఆలయం తన ప్రాభవాన్ని కోల్పోయింది. జటప్రోల్‌లోనే ఉన్న అగస్తేశ్వర ఆలయం, 19 మూకగుడుల నిర్వహణను సైతం ఎవరూ పట్టించుకోవడం లేదు.

ఆదరణ లేక..

జిల్లాలోని పలు ఆలయాలకు చారిత్రక ప్రాశస్థ్యమున్నప్పటికీ సరైన ఆదరణ లేక వెలవెలబోతున్నాయి. మంచాలకట్ట వద్ద కృష్ణానది తీరాన శతాబ్దాల చరిత్ర కలిగిన రామతీర్థాలయంలో దేవతామూర్తులు నిత్య ధూప, దీప, నైవేద్యాలకు నోచుకోవడం లేదు. అమరగిరి సమీపంలో కృష్ణాతీరంలోనే మునులు ప్రతిష్ఠించిన మల్లయ్యస్వామి గుడి పరిస్థితి కూడా ఇంతే. పెద్దకొత్తపల్లి మండలం దేవల్‌తిర్మలాపూర్‌ వేంకటేశ్వరస్వామి ఆలయానికి రెండో తిరుపతిగా ఒకప్పుడు పేరుండేది. క్రమంగా ఆ గుడి ప్రాభవం కోల్పోతోంది. పెంట్లవెల్లిలోని శివాలయం, చిన్నంబావి మండలం బెక్కెం సమీపంలోని సూర్యదేవాలయం, పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్‌ శివాలయం, నందీశ్వరాలయం, బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్‌లోని ఆలయాలకు సరైన ఆదరణ లభించడం లేదు.

శాసనాలు, విగ్రహాల పరిస్థితి అంతే..

పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్‌లో 13వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలంనాటి శిలాశాసనం ఉంది. దీన్ని పట్టించుకునే వారే లేరు. కొల్లాపూర్‌లోని ఆర్‌ఐడీ కళాశాల సమీపంతోపాటు పలు ప్రాంతాల్లో సురభిరాజులకు సంబంధించిన శాసనాలు ఉన్నాయి. మల్లేశ్వరం సమీపంలోని గుట్టపై పురాతన దేవతామూర్తుల విగ్రహాలు పూజలకు నోచుకోవడం లేదు. సోమశిలలో పురాతన విగ్రహాలను మ్యూజియంలో ఉంచగా.. కొన్ని చెట్ల కిందే ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా పురాతన విగ్రహాలు, శిలాశాసనాలు చాలా చోట్ల రక్షణ లేకుండా ఉన్నాయి.

సాస్కీ నిధులపైనే ఆశలు..

సోమశిల పరిసర పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల అభివృద్ధి కోసం స్పెషల్‌ అసిస్టెన్స్‌ టు స్టేట్స్‌ ఫర్‌ క్యాపిటల్‌ ఇన్వెస్టిమెంట్‌ (సాస్కీ) ద్వారా కేంద్రం రూ.68.10 కోట్లు కేటాయించింది. ఈ నిధుల వినియోగం, పర్యాటక అభివృద్ధి అంశాలను గతేడాది రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటకశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జయేశ్‌ రంజన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వల్లూరి క్రాంతి పరిశీలించారు. సోమశిల, అమరగిరి, జటప్రోల్‌, మంచాలకట్ట, మల్లేశ్వరం ప్రాంతాలను తిలకించారు. సాస్కీ నిధులతోనైనా పురాతన ఆలయాలు, విగ్రహాలకు పూర్వవైభవం తీసుకొచ్చే పనులు త్వరగా చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement