● ఒకే కేంద్రం పరిధిలో
రెండు ఘటనలు వెలుగులోకి..
● జిల్లా ఉన్నతాధికారులు సీరియస్
● ఐదుగురిపై సస్పెనన్ వేటు..
పోలీస్ కేసులు నమోదు
● అధికార పార్టీ విధేయులకు
మినహాయింపు ఇచ్చారా?
వనపర్తి: జిల్లాలో ఎప్పటిలాగే యాసంగి సీజన్‌లోనూ వరి ధాన్యం కొనుగోళ్లు భారీగా చేపట్టారు. సుమారు 300కుపైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరించారు. కొనుగోళ్లు తుదిదశకు చేరుకున్న సమయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గ పరిధిలోని పాన్‌గల్ మండలం మాందాపూర్‌లో కొందరు పాత ధాన్యం విక్రయించారని వచ్చిన ఫిర్యాదుల మేరకు జిల్లా అధికారులు విచారణకు ఆదేశించిన విషయం విధితమే. ఒకే గ్రామంలోని ఒకే కేంద్రం (ఐకేపీ) పరిధిలోనే రెండు ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. ఇందులో ఒకటి శ్రీరంగాపురం మండలంలోని గోదాంలో ధాన్యం నిల్వ చేసే సమయంలో అక్కడి గోదాం ఇన్‌చార్జ్‌లు గుర్తించగా.. మరో ఘటనలో వికయ్రానికి లారీలో తీసుకొచ్చిన ధాన్యం పాతదిగా అధికారులు గుర్తించి పౌరసరఫరాలశాఖ అఽధికారులకు సమాచారం ఇవ్వటంతో విచారణ చేపట్టి నిర్ధారించుకున్నారు. రెండు వేర్వేరు కేసులు పాన్‌గల్ పోలీస్‌స్టేషన్‌లో నమోదు కావడం గమనార్హం. ఈ రెండు ఘటనల్లో అదే గ్రామానికి చెందిన రెండు మిల్లర్ల కుటుంబాలకు చెందిన వారిపై అభియోగాలు రావడం ఆలోచించాల్సిన అంశంగా చెప్పవచ్చు. మిల్లర్లు, అధికారుల వాదనలకు పొంతన లేకపోయినా.. మొదటి ఘటనపై స్వయంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి ఏఈఓ, ఏపీఎంల నిర్లక్ష్య ధోరణి ఉన్నట్లు గుర్తించి చర్యలకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసి వారిచ్చిన సమాధానం సంతృప్తిగా లేదని సస్పెన్షన్ వేటు వేసినట్లు సంబంధిత శాఖల జిల్లా అధికారులు ధ్రువీకరించారు.
కేంద్రంలో గుర్తించకపోవడం ఏమిటి..?
పాత ధాన్యం విక్రయానికి తీసుకొస్తే కొనుగోలు కేంద్రం నిర్వాహకులు గుర్తించకపోవడానికి కారణం ఏమిటి..? ఒకవేళ కేంద్రంలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుంటే మార్గమధ్యంలో ధాన్యం మార్చారా అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారా..? ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ లారీకి బదులు ప్రైవేట్ లారీలో ధాన్యం తరలించడంతో పాత ధాన్యం అందులోకి వచ్చిందా అనే కోణంలో విచారణ చేశారా అనే ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానం లేకపోవడం శోచనీయం. పాత ధాన్యం విక్రయానికి వ్యవసాయ విస్తరణ అధికారి టోకెన్ ఎలా జారీ చేశారనే విషయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఘటనలు జిల్లావ్యాప్తంగా ఇంకా ఎన్నెన్ని జరిగాయోనన్న చర్చలు లేకపోలేదు. ఇందిరాక్రాంతి పథం విభాగానికి వస్తే.. గ్రామ అధికారి లేకపోవడం, ఇన్‌చార్జ్ బాధ్యతలు ఎవరికై నా ఇచ్చారా.. ఇస్తే ఈ విషయంపై వారి పాత్ర ఏమిటనే విషయం ఈ సందర్భంగా చర్చకు రాకపోవడం ప్రశ్నించాల్సిన అంశమే.
పాత వరి ధాన్యం విక్రయాల ఉదంతంలో కొందరు అధికార పార్టీకి విధేయులైన ఉద్యోగులు ఉన్నారు. వారిపై చిన్నపాటి కారణాలు చూపించి చర్యలను తప్పించారనే విమర్శలు పాన్‌గల్ మండలంతో పాటు డిపార్ట్‌మెంట్‌లో వినిపిస్తోంది. ఈ వ్యవహారంలో సూత్రధారులైన మరికొందరిని అధికార పార్టీ నేతలు కాపాడినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. వీఆర్‌ఏల సస్పెన్షన్‌లోనూ అధికార పార్టీ పెద్ద నాయకుల నుంచి ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై వివరణ కోసం రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్‌ను ఫోన్‌లో సంప్రదించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు.


