వనపర్తి: నియోజకవర్గంలో కొనసాగుతున్న నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించి పనులు నాణ్యతగా, వేగంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సూచించారు. శుక్రవారం స్థానిక ఇరిగేషన్ సీఈ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాలు, సాగునీటి కాల్వల నిర్మాణం, విస్తరణ పనుల స్థితిగతులపై సుదీర్ఘంగా చర్చించారు. కేఎల్‌ఐ డీ–5, డీ–8 కాల్వల విస్తరణ పనులపై దృష్టి సారించాలన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్‌కు సంబంధించి వివరణాత్మక ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని సూచించారు. గోపాల్‌పేట రిజర్వాయర్ ప్రతిపాదనల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. బుద్ధారం స్టేజ్–2 ఆన్‌లైన్ రిజర్వాయర్‌కు సంబంధించిన అంశాలపై చర్చించిన ఎమ్మెల్యే భవిష్యత్ సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని సూచించారు. ఖిల్లాఘనపురం గణపసముద్రం రిజర్వాయర్ పనులు త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని, పెద్దమందడి మండలం గట్లఖానాపూర్‌లో నిర్మించనున్న రిజర్వాయర్‌కు సంబంధించిన నివేదికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఖాన్ చెరువు అభివృద్ధి పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రేవల్లి మండలం తల్పునూరు, తల్పునూరు తండాలో సుమారు రెండు వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలపై చర్చించారు. ఏదుల, అనంతపూర్ గ్రామాల ఆయకట్టు విస్తరణ అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకొని అవసరమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు. భీమా కెనాల్ విస్తరణ పనులపై అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే రైతుల సాగునీటి అవసరాలను తీర్చేలా కాల్వల సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. కర్నెతండా ఎత్తిపోతల పథకంలో మిగిలిన పనులను వెంటనే పూర్తిచేసి ప్రజలకు పూర్తిస్థాయిలో ప్రయోజనం చేకూర్చాలని ఆదేశించారు. బుద్ధారం కుడి కాల్వ ఆయకట్టును స్థిరీకరించాలన్నారు. కార్యక్రమంలో సీఈ రహీమోద్దీన్, ఎస్‌ఈ చంద్రశేఖర్, ఈఈలు, డీఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.
రూ.2.34 కోట్ల పరిహారం చెక్కులు పంపిణీ..
ఏదుల రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన 47 మంది రైతులకు రూ. 2.34 కోట్ల పరిహారం చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి జిల్లాకేంద్రంలోని క్యాంపు కాార్యాలయంలో అందజేశారు. వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ బి.శ్రీనివాస్‌గౌడ్, పుర వైస్ చైర్మన్ మధుసూదన్‌గౌడ్, గోపాల్‌పేట మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు సత్యశీలారెడ్డి పాల్గొన్నారు.


