నేడు సీఎం రేవంత్‌రెడ్డి కృతజ్ఞత సభ
● 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని
పురస్కరించుకుని పర్యటన
● ఊర్కొండపేటలోని హనుమాన్
ఆలయంలో ప్రత్యేక పూజలు
● ప్రజాప్రతినిధిగా తొలి అడుగు వేసిన నేలలో ఆత్మీయులతో భేటీ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శనివారం నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. 2006లో ఆయన మిడ్జిల్ జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొంది ప్రజాప్రతినిధిగా రాజకీయాల్లోకి తొలి అడుగు వేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న వేళ అదే నేలపై ముఖ్యమంత్రి హోదాలో వందన సభ ద్వారా ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారు. జెడ్పీటీసీ సభ్యుడిగా మొదలైన తన రాజకీయ ప్రయాణంలో వెంట నడిచిన మిడ్జిల్, ఊర్కొండ మండలాలకు చెందిన ఆనాటి ఆత్మీయులతో భేటీకానున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన నేలలో రేవంత్‌రెడ్డి పర్యటన అటు రాజకీయంగా, ఇటు భావోద్వేగ పరంగా ప్రత్యేకతను సంతరించుకుంది.


