త్వరలోనే అల్పాహార పథకం అమలు | - | Sakshi
Sakshi News home page

త్వరలోనే అల్పాహార పథకం అమలు

Jul 4 2026 12:26 AM | Updated on Jul 4 2026 12:26 AM

కొత్తకోట రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని.. త్వరలోనే ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం సైతం అమలు కానుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని రాయిణిపేట ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభితో కలిసి కొత్తగా నిర్మించిన కిచెన్‌ షెడ్‌ను ప్రారంభించడంతో పాటు అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలకు అధిక డిమాండ్‌ ఉందని, భవిష్యత్‌లో ప్రవేశ పరీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నాయన్నారు. విద్యార్థులకు పోషకాహారం అందించి వారి ఆరోగ్యంతో పాటు విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కలెక్టర్‌ తన నిధుల నుంచి రూ.23.80 లక్షలు మంజూరు చేసి పాఠశాల అభివృద్ధికి సహకరించడం అభినందనీయమని, ఇందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల స్థాయి నుంచే కృత్రిమ మేధా (ఏఐ) విద్యను కూడా ప్రవేశపెట్టే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అంతకుముందు కలెక్టర్‌ మాట్లాడుతూ.. రాయిణిపేట ప్రభుత్వ పాఠశాలలో సమర్థవంతమైన ఉపాధ్యాయ బృందం పనిచేస్తోందని.. ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ జిల్లా విద్యాధికారి యాదయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పి.ప్రశాంత్‌, సర్పంచ్‌ భాగ్యలక్ష్మి, డీఎస్‌ఓ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ సుభాష్‌నాయుడు, ఎంపీడీఓ వినీత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement