విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి

Jul 4 2026 12:26 AM | Updated on Jul 4 2026 12:26 AM

వనపర్తి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, విద్యా ప్రమాణాల పెంపు, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఇన్‌చార్జ్‌ జిల్లా విద్యాధికారి యాదయ్యతో కలిసి మండల విద్యాధికారులు, కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తగ్గుముఖం పట్టకుండా పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రతి గ్రామంలో తల్లిదండ్రులకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయుల ముఖ హాజరును పక్కాగా నమోదు చేయాలని, ఈ ప్రక్రియపై ఎంఈఓలు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం తయారీలో వంట గ్యాస్‌ వినియోగించాలని.. కట్టెల పొయ్యిపై వండుతున్నట్లు కనిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే యూడైస్‌ పోర్టల్‌లో విద్యార్థుల వివరాలు పూర్తిస్థాయిలో నమోదు చేయడంతో పాటు బాలబాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని, మరుగుదొడ్లు లేని పాఠశాలలను గుర్తించి వెంటనే ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. పదోతరగతి విద్యార్థులకు గణితం, సైన్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టుల్లో ప్రత్యేక తరగతులు ప్రారంభించాలని, విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాన్ని పెంచేలా నాణ్యమైన సామగ్రిని సిద్ధం చేయాలన్నారు. గతేడాది గణితంలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు రూపొందించిన పుస్తకం మాదిరి ఈ ఏడాది కూడా సైనన్స్‌, ఇంగ్లిష్‌లో ప్రత్యేక పుస్తకాలను రూపొందించి విద్యార్థులకు మెరుగైన బోధన అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

ఈవీఎం గోదాం పరిశీలన..

జిల్లాకేంద్రంలోని ఈవీఎం గోదాంకు కట్టుదిట్టమైన భద్రత కల్పించినట్లు కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి తెలిపారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా శుక్రవారం రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఈవీఎం గోదామును తనిఖీ చేసి సమగ్ర నివేదికను సమర్పిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ వెంట ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్లు రమేష్‌రెడ్డి, వెంకటేశ్వర్లు ఇతర అధికారులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement