అర్హుల ఓటుహక్కు తొలగించొద్దు | - | Sakshi
Sakshi News home page

అర్హుల ఓటుహక్కు తొలగించొద్దు

Jul 4 2026 12:26 AM | Updated on Jul 4 2026 12:26 AM

ఆత్మకూర్‌/అమరచింత/నర్వ: సర్‌ ప్రక్రియలో భాగంగా బీఎల్వోలు అర్హులైన వారి ఓట్లు తొలగించకుండా చూసుకోవాలని నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్‌, మక్తల్‌ నియోజకవర్గ ఈఆర్‌ఓ శ్రీను ఆదేశించారు. శుక్రవారం నర్వ మండలం నాగిరెడ్డిపల్లి, ఆత్మకూర్‌ పురపాలికలోని ఖానాపూర్‌, అమరచింత మండలం కొంకన్వానిపల్లి, పాంరెడ్డిపల్లిలో పర్యటించి సర్‌ ప్రక్రియను పరిశీలించారు. బీఎల్వోలు ఇల్లిల్లూ తిరిగి ఎన్యూమరేషన్‌ ఫారాలు పంపిణి చేశారా అని అడిగి తెలుసుకున్నారు. పంపిణీ చేసిన ఫారాలను ఎలా నింపుతున్నారని బీఎల్వోలను ప్రశ్నించారు. ఎన్యూమరేషన్‌ ఫారాలను పూర్తి చేసిన తర్వాత నేరుగా సేకరించి తుది జాబితాలో ఓటరు పేరు నమోదయ్యే వరకు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. వలస వెళ్లిన కుటుంబాల ఓటర్ల ఫోన్‌నంబర్‌లకు తీసుకొని సమాచారం అందించాలని, గ్రామానికి వచ్చి ఫారాలు పూర్తిచేసి ఇవ్వమంటూ సందేశాలు పంపాలని సూచించారు. ఫారాలు నింపే సమయంలో తప్పొప్పులు లేకుండా చూసుకోవాలన్నారు. ఫారాల్లో ఓటర్ల కొత్త ఫొటోలు అతికించి వివరాలను మొబైల్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. ఎలాంటి తప్పులు లేకుండా దగ్గరుండి ఫారాలు పూర్తి చేయాలని కోరారు. వివరాలు తప్పుగా నింపి ఓటు తొలగించేలా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి నిరంతరం ఓటర్ల వివరాలను సేకరించి అప్‌లోడ్‌ చేయాలన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఆయన వెంట ఆత్మకూర్‌, అమరచింత తహసీల్దార్లు జేకే మోహన్‌, రవికుమార్‌ యాదవ్‌ సూపర్‌వైజర్‌ దండు శ్రీశైలం, బీఎల్వో కవిత ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement