వనపర్తిటౌన్: రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలనుకునే కక్షిదారులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదిస్తే వారి గ్రామానికే వచ్చి పరిష్కరిస్తామని.. జిల్లాలోని కక్షిదారులు సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాకరాజు శ్రీనివాసరావు కోరారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని కోర్టు ఆవరణలో సంచార లోక్ అదాలత్ వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. సంచార లోక్ అదాలత్ వాహనం నెలరోజుల పాటు జిల్లాలోని అన్ని గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు ఉచిత న్యాయ సేవలు, న్యాయ సలహాలు అందిస్తుందన్నారు. ప్రజలకు చట్టాలపై అవగాహన పెంపొందించేందుకు తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ రూపొందించిన లఘు చిత్రాలను వాహనంపై ఉన్న తెరపై ప్రదర్శిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కళార్చన, అడిషనల్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి కె.కవిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి టి.కార్తీక్‌రెడ్డి, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి బి.శ్రీలత, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి ఎన్.అశ్విని, బార్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


