పేదలకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు | - | Sakshi
Sakshi News home page

పేదలకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

Jul 3 2026 12:23 AM | Updated on Jul 3 2026 12:23 AM

గడువులోగా నిర్మాణాలు పూర్తికావాలి

కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

కొత్తకోట రూరల్‌: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం కొత్తకోట ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో కొత్తకోట, మదనాపురం మండలాల అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లు మంజూరై పనులు ప్రారంభం కాని వాటిని వెంటనే గ్రౌండింగ్‌ చేయించి ప్రారంభించేలా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలన్నారు. లబ్ధిదారులు ప్రైవేట్‌ అప్పులపై ఆధారపడకుండా స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు పొందేలా అవగాహన కల్పించాలని సూచించారు. కొత్తకోటలో 58, మదనాపురం మండలంలో 28 ఇళ్ల నిర్మాణాలు తక్షణమే ప్రారంభించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు. ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించి రోజువారీ పురోగతిని పర్యవేక్షిస్తూ లక్ష్యాలను పూర్తి చేయాలని కోరారు. కొత్త ఇళ్ల మంజూరుకు సంబంధించి అర్హులను గుర్తించి వెంటనే తమ లాగిన్‌కు పంపాలని అధికారులను ఆదేశించారు. గుడిసెల్లో నివసించే వారికి ప్రథమ ప్రాధాన్యతగా ఇళ్లు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

దొడ్డురకం వరి సాగు వద్దు..

గ్రామాల్లో రైతులు దొడ్డురకం వరి సాగు చేయకుండా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సన్నరకం వరి ధాన్యం మాత్రమే పండించేలా, పంటమార్పిడీపై వారికి అవగాహన కల్పించాలన్నారు. సన్నరకానికి మాత్రమే బోనస్‌ వస్తుందన్న విషయాన్ని వారికి తెలియజేయాలని.. ధాన్‌ రకం వరి వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. విత్తన సరఫరా డీలర్లతో సమావేశం నిర్వహించి అలాంటి రకాలను విక్రయించ వద్దని ఆదేశాలు జారీ చేయాలన్నారు. అదేవిధంగా నానో యూ రియా, డీఏపీ వినియోగంపై కూడా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అంతకుముందు కార్యాలయ సమీపంలో ని ర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇంటిని సందర్శించి లబ్ధిదారుతో మాట్లాడి నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, హౌసింగ్‌ పీడీ విఠోబా, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ పి.పల్లవి, తహసీల్దార్‌ సుభాష్‌నాయుడు, ఎంపీడీఓ వినీత్‌, పుర కమిషనర్‌ సైదయ్య, ఇతర మండల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement