వనపర్తి: ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ గడువులోగా పూర్తి కావాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం నుంచి అన్ని మండలాల తహసీల్దార్లు, సూపర్‌వైజర్లు, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ నేటితో పూర్తి చేయాలని.. వాటిని సక్రమంగా ఎలా నింపాలో ఓటర్లకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. నెమ్మదిగా సాగుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతం చేయాలని సూచించారు. బీఎల్వోలకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి సమయ పాలనతో పని చేయించేలా తహసీల్దార్లు పర్యవేక్షించాలన్నారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిన వెంటనే బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి సేకరణ ప్రారంభించాలని.. సేకరణ సమయంలో ఓటర్లు పూరించిన అన్ని వివరాలను సమగ్రంగా పరిశీలించాలని, సంబంధిత డాక్యుమెంట్లను తీసుకొని ఎలాంటి తప్పులు లేకుండా ధ్రువీకరించాలన్నారు. డేటా ఆన్‌లైన్ ఎంట్రీలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని, ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.


