ప్లాస్టిక్‌ భూతం..! | - | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ భూతం..!

Jul 2 2026 7:07 AM | Updated on Jul 2 2026 7:07 AM

చర్యలు తీసుకోవాలి.. అధికారుల నిర్లక్ష్యంతోనే.. జరిమానాలు విధిస్తున్నాం..

పల్లెల్లో పట్టింపు కరువు..

జిల్లాలో ప్రకటనలకే పరిమితమైన నిషేధం

విచ్చలవిడిగా పాలిథిన్‌ కవర్ల

వినియోగం

హెచ్చరికలను పట్టించుకోని వ్యాపారులు

చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న

అధికారులు

పాలిథిన్‌ కవర్లు వినియోగిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి. ప్లాస్టిక్‌ కవర్ల విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తేనే ప్రయోజనం ఉంటుంది. వ్యాపారులకు మరోమారు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి.

– కళాంపాషా, రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా ఉపాధ్యక్షుడు, అమరచింత

అధికారుల నిర్లక్ష్యం, వ్యాపారుల అవగాహన రాహిత్యంతోనే ప్లాస్టిక్‌ వాడకం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఇందుకు ప్లాస్టిక్‌ను అడ్డగోలుగా వాడుతున్న వారు కూడా బాధ్యులే. అధికారులు రోజువారీగా దాడులు నిర్వహిస్తేనే పాలిథిన్‌ కవర్ల వాడకాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది.

– మోష, సీపీఐ నాయకుడు, ఆత్మకూర్‌

పాలిథిన్‌ కవర్ల వినియోగాన్ని నిషేధించినా కొందరు దుకాణదారులు వినియోగిస్తున్నారు. మున్సిపాలిటీలోని దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతూ.. నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధిస్తున్నాం. ప్లాస్టిక్‌త్‌ కలిగే అనర్థాలపై ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాం.

– నరేశ్‌కుమార్‌,

మున్సిపల్‌ కమిషనర్‌, ఆత్మకూర్‌

ఆత్మకూర్‌: జిల్లాలో ప్లాస్టిక్‌ నిషేధం కేవలం ప్రకటనలకే పరిమితమైంది. ప్లాస్టిక్‌ వినియోగంతో తీవ్ర అనర్థాలు చోటు చేసుకుంటాయని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా వ్యాపారులు బేఖాతరు చేస్తున్నారు. విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ కవర్ల వినియోగంతో ఎక్కడబడితే అక్కడ గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ప్లాస్టిక్‌ను నియంత్రించాల్సిన అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పట్టణాల్లోని వ్యాపార దుకాణాల్లో అడపాదడపా తనిఖీలు నిర్వహిస్తూ, నిషేధిత ప్లాస్టిక్‌ వినియోగించే వారికి జరిమానాలు విధిస్తున్నారు తప్ప.. శాశ్వత చర్యలు చేపట్టడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అవగాహన కల్పిస్తున్నా..

పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్‌ నియంత్రణలో భాగంగా 2022 జూలై 1 నుంచి మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ విభాగం ప్లాస్టిక్‌ నిషేధం అమలు చేస్తోంది. ప్లాస్టిక్‌ పుల్లలతో ఉన్న ఇయర్‌బర్డ్స్‌, బెలూన్లు, ప్లాస్టిక్‌ జెండాలు, క్యాండిస్టిక్స్‌, ఐస్‌క్రీం పుల్లలు, థర్మకోల్‌, ప్లాస్టిక్‌ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, కత్తులు, స్పూన్లు, స్ట్రాలు, ప్యాకింగ్‌ కవర్లు, 100 మైక్రాన్ల కంటే తక్కువగా ఉండే కవర్లు, బ్యానర్లు తదితర వస్తువులపై నిషేధం విధించారు. అలాగే 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండే ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులు పూర్తిగా నిషేధించబడ్డాయి. పాలిథిన్‌ కవర్ల స్థానంలో కాగితపు కవర్లు, జ్యూట్‌ బ్యాగులు, బట్ట సంచులు మాత్రమే వినియోగించాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నా మార్పు రావడం లేదు. ప్రతి దుకాణంలో పాలిథిన్‌ కవర్లనే వినియోగిస్తుండటంతో డ్రెయినేజీలు, రోడ్లపై ఎక్కడబడితే అక్కడ దర్శనమిస్తున్నాయి.

ఏడాది కాలంలో 6 క్వింటాళ్లకు పైగా..

ఆత్మకూర్‌ మున్సిపాలిటీలో ఏడాది వ్యవధిలోనే 6 క్వింటాళ్లకు పైగా ప్లాస్టిక్‌ కవర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 20 మంది వ్యాపారులకు రూ. 1,000 నుంచి రూ. 5వేల వరకు జరిమానాలు విధించారు. అమరచింత మున్సిపాలిటీలో 50 కేజీల ప్లాస్టిక్‌ కవర్లను స్వాధీనం చేసుకొని ఆరుగురికి జరిమానాలు విధించినట్లు సమాచారం. పెబ్బేరులో 350 కేజీల ప్లాస్టిక్‌ వస్తువులను స్వాధీనం చేసుకుని 25 మందికి జరిమానా విధించారు. కొత్తకోటలో 70 కేజీల కవర్లు స్వాధీనం చేసుకున్నారు. వనపర్తిలో 65 కేజీల ప్లాస్టిక్‌ కవర్లు స్వాధీనం చేసుకుని 26 మందికి జరిమానాలు విధించారు.

జిల్లాకేంద్రమైన వనపర్తితో పాటు ఆత్మకూర్‌, కొత్తకోట, అమరచింత, పెబ్బేరు మున్సిపాలిటీల్లోని దుకాణాల్లో అధికారులు అప్పుడప్పుడు దాడులు నిర్వహించి.. జరిమానాలు విధిస్తున్నారు. అయితే పల్లెల్లో ప్లాస్టిక్‌ నిషేధం ఎవరికీ పట్టడం లేదు. గ్రామస్థాయిలో సైతం తనిఖీలు చేపట్టి.. ప్లాస్టిక్‌ నిషేధాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయాలని పలువురు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement