వనపర్తి: జిల్లావ్యాప్తంగా ఈ నెల 31వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్–1861 అమలులో ఉంటుందని ఎస్పీ సునీతారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పోలీసు ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, నిరసన కార్యక్రమాలు, భారీ స్థాయి సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించడం పూర్తిగా నిషేధమన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను పోలీసులు ఏమాత్రం ఉపేక్షించబోరని.. 30 పోలీస్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల భద్రత, ప్రశాంతత, సామాజిక శాంతిని పరిరక్షించడమే ఈ నిబంధనల ప్రధాన ఉద్దేశమన్నారు. చట్టాలను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని.. ప్రజల సహకారంతోనే జిల్లాలో ప్రశాంత వాతావరణాన్ని మరింత బలోపేతం చేయగలమన్నారు. ప్రజలందరూ పోలీసుశాఖకు సహకరించి శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఎస్పీ కోరారు.
పాఠశాలల్లో
సోషల్ ఆడిట్
వనపర్తిటౌన్: సర్వశిక్ష పథకం సోషల్ ఆడిట్‌కు 2026–27 విద్యా సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా 5,363 పాఠశాలలను ఎంపిక చేసినట్లు క్లస్టర్ సోషల్ ఆడిటర్ రామస్వామి తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని హరిజనవాడ ఉన్నత పాఠశాలలో సామాజిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాలలో పరిపాలన, ఆర్థికపరమైన అంశాలు, ఎస్‌ఎంసీకి సంబంధించిన రికార్డులు, బోధన సదుపాయాలు, మౌలిక వసతులు, గ్రంథాలయం, మధ్యాహ్న భోజనంలో నాణ్యత తదితర అంశాలను పరిశీలించారు. ఆయన వెంట ఏఏపీసీ చైర్మన్ సునీత, కౌన్సిలర్ మదన్, ఇన్‌చార్జి హెచ్‌ఎం రవికుమార్, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిషన్ మెంబర్స్ వెంకటేశ్, విశ్వంబాబు, గంధం నాగరాజు ఉన్నారు.
కార్మికుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు
అమరచింత: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, కర్షకుల హక్కులను కాలరాస్తున్నాయని సీపీఐ (ఎంఎల్)మాస్‌లైన్ పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి సీహెచ్ రాంచందర్ అన్నారు. అమరచింతలోని మార్క్స్ భవనంలో బుధవారం నిర్వహించిన మాస్‌లైన్ ఉమ్మడి జిల్లా శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. దేశంలో అనేక సమస్యలతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నా పాలకులు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. రైతుల పోరాటంతో నల్ల చట్టాల అమలుపై వెనక్కి తగ్గిన కేంద్రం.. మళ్లీ నల్ల చట్టాలను అమలు చేయాలని చూడటం సరికాదన్నారు. కార్మికులు జీతాల పెంపు కోసం, పనిగంటల కోసం పోరాటాలు చేస్తుంటే.. లేబర్ కోడ్స్ తీసుకొచ్చి పనిగంటలను పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలతో జంజీ ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాడేందుకు మాస్‌లైన్ కార్యకర్తలు, నాయకులు ముందుండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి హనుమంతు, వెంకటేశ్, ప్రసాద్, సాంబశివుడు, గణేశ్, కొండారెడ్డి, దేవదానం, రాజన్న, రాజు, కృష్ణవేణి, గీత పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కొత్తకోట రూరల్: పెద్దమందడి మండలం మోజర్ల సమీపంలోని ఉద్యాన కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల అసోసియేట్ డీన్ డా.వీణ జోషి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బైపీసీ విద్యార్థుల కోసం నాలుగేళ్ల బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్ డిగ్రీ ప్రోగ్రాంలో ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభమైందని.. ఈ నెల 29వ తేదీలోగా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని.. దరఖాస్తుల సమర్పణకు 30 వరకు గడువు ఉందన్నారు. దరఖాస్తులోని వివరాల సవరణకు ఆగస్టు 1న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. అర్హత గల విద్యార్థులు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ rktfhu.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని.. మరిన్ని వివరాలకు 89771 29027, 76830 53157 నంబర్లను సంప్రదించాలని కోరారు.


