మాటల్లో కాదు.. చేతల్లో అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

మాటల్లో కాదు.. చేతల్లో అభివృద్ధి

Jul 2 2026 7:07 AM | Updated on Jul 2 2026 7:07 AM

వనపర్తిటౌన్‌: జిల్లా కేంద్రాన్ని అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికలను సిద్ధం చేసి.. ఆచరణలో చేసి చూపిస్తున్నామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో రూ. 22కోట్లతో నిర్మించనున్న ఆధునిక ఇంటిగ్రేటెడ్‌ టవర్‌ నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాకేంద్రంలో ఐటీ టవర్‌ నిర్మించడంతో జిల్లాకేంద్ర అభివృద్ధికి మరో కీలక అడుగు పడిందన్నారు. అభివృద్ధిని మాటలతో కాకుండా.. చేతల్లో చూపిస్తున్నామని అన్నారు. జిల్లాను సాంకేతిక రంగంలో ముందంజలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, స్టార్టప్‌ సంస్థలు వనపర్తికి రావడానికి ఐటీ టవర్‌ కీలక వేదికగా మారనుందని.. ఉద్యోగాల కోసం ఇక్కడి యువత ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందన్నారు. అత్యాధునిక సదుపాయాలతో నిర్మించబడనున్న ఐటీ టవర్‌ ద్వారా డిజిటల్‌ సేవలు మరింత విస్తరించడంతో పాటు కొత్త పెట్టుబడులు జిల్లాకు ఆకర్షితమవుతాయని అన్నారు. అనంతరం నాగవరంలోని చెంచు ప్రాంత మహిళలకు ఎమ్మెల్యే ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మాధవి, వైస్‌చైర్మన్‌ మధుసూదన్‌ గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు కదిరె రాములు, బ్రహ్మాచారి, బి.కృష్ణ, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement