వనపర్తి: జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ నిర్వహణలో రాజకీయ పార్టీల ప్రతినిధులు నిర్మాణాత్మక సహకారం అందించాలని అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్ కోరారు. బుధవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సర్ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల నింపడంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఓటరు అందుకున్న ఎన్యూమరేషన్ ఫారాన్ని పూరించి తిరిగి బీఎల్‌ఓలకు అందజేస్తేనే ఓటరు జాబితాలో చోటు లభిస్తుందన్నారు. బూత్ లెవెల్ ఏజెంట్లు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరికి ఫారం అందేలా సహకరించాలని కోరారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రహ్మణ్యం ఉన్నారు.


