రోగులకు మెరుగైన వైద్యసేవలు | - | Sakshi
Sakshi News home page

రోగులకు మెరుగైన వైద్యసేవలు

Jul 1 2026 12:46 AM | Updated on Jul 1 2026 12:46 AM

వనపర్తి: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యసేవలు, మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా సిబ్బంది పని చేయాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ఎంసీహెచ్‌, జీజీహెచ్‌ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. ఎంసీహెచ్‌లో రికార్డులను పరిశీలించి రోజు ఎంతమంది గర్భిణులు వైద్య పరీక్షల కోసం వస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్నారు. గర్భిణుల ఆరోగ్య నివేదికలను పరిశీలించి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. టిఫా స్కానింగ్‌ కేంద్రాన్ని తనిఖీ చేసి ఎంతమంది గర్భిణులు వినియోగించుకున్నారో రికార్డులను పరిశీలించారు. పేద గర్భిణులు సేవలు పొందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం వైద్యులతో నిర్వహించిన సమీక్షలో గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ముఖ్యంగా రక్తహీనత (అనీమియా)తో బాధపడుతున్న గర్భిణులను గుర్తించి ప్రత్యేక చికిత్స, పోషకాహారం, మందులు అందించాలన్నారు. జిల్లాలో రక్తహీనత సమస్యను తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. టిఫా స్కానింగ్‌ యంత్రాన్ని పూర్తిస్థాయిలో వినియోగించి రోజు కనీసం ఐదుగురు గర్భిణులకు స్కానింగ్‌ నిర్వహించాలని సూచించారు.

జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలోని డయాలసిస్‌ వార్డును తనిఖీ చేసిన కలెక్టర్‌ చికిత్స పొందుతున్న రోగుల వివరాలు తెలుసుకొని నాణ్యమైన వైద్యం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. డయాలసిస్‌ వార్డును గ్రౌండ్‌ ఫ్లోర్‌కు మార్చాలని రోగులు కోరగా.. క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో మరో డయాలసిస్‌ వార్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆస్పత్రిలో అవసరమైన మౌలిక సదుపాయాల ప్రతిపాదనలు సమర్పించాలని, నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. కలెక్టర్‌ వెంట వైద్యాధికారి డా. సాయినాథ్‌రెడ్డి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ శివప్రసాద్‌, ఇతర వైద్య అధికారులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement