పాన్‌గల్: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని ఎస్పీ సునీతారెడ్డి ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆమె సందర్శించగా.. సీఐ రత్నం, ఎస్‌ఐ కుర్మయ్య పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. రికార్డులు, స్టేషన్ పరిసరాలు, సిబ్బంది క్వార్టర్స్, శిథిలావస్థకు చేరిన సిబ్బంది క్వార్టర్స్‌ను పరిశీలించారు. స్టేషన్ ఆవరణలో కేసులు నమోదై నిలిపిన వాహనాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ సమీపంలో ఉన్న కొందరు ఇళ్ల యజమానులు వారికి సంబంధించిన రాళ్లు, ఇతర సామగ్రి ఆవరణలో వేయడం ఏమిటని ఎస్‌ఐని ప్రశ్నించి వెంటనే తొలగించాలని ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడు పోలీసుశాఖ తనకు అండగా ఉందనే నమ్మకంతో తిరిగి వెళ్లాలన్నారు. బాధితులకు న్యాయం చేయడం, ప్రజలకు భద్రత కల్పించడం, నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడం ప్రతి పోలీస్ అధికారి ప్రధాన బాధ్యతని తెలిపారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సిబ్బంది విధులను సక్రమంగా నిర్వర్తించాలని.. తమ సమస్యలను ఎట్టి పరిస్థితుల్లో విధుల్లో ప్రదర్శించకూడదన్నారు. పోలీస్‌శాఖకు చెడ్డపేరు తీసుకొస్తే సహించేది లేదని హెచ్చరించారు. సిబ్బంది తమ కుటుంబానికి కొంత సమయం కేటాయించాలని, పిల్లలను బాగా చదివించాలని, ఏవైనా సమస్యలుంటే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో ఆమె మొక్క నాటారు.


