వనపర్తి: జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్) కార్యక్రమాన్ని వేగంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం పుర పరిధిలోని పలు వార్డులతో పాటు పెబ్బేరు మండలం కంచిరావుపల్లిలో పర్యటించి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. బీఎల్వోలతో కలిసి పలు ఇళ్లకు తిరిగి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని ప్రత్యక్షంగా తిలకించారు. వారితో మాట్లాడి ఫారాలు అందాయా లేదా అని ఆరా తీశారు. రికార్డులను తనిఖీ చేసి ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరుకి తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారం అందేలా చర్యలు తీసుకోవాలని, ఏ ఒక్క ఓటరు కూడా జాబితాలో మిస్ కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మార్గదర్శకాల ప్రకారం నిర్దేశించిన గడువులోగా ఫారాల పంపిణీ ప్రక్రియ వందశాతం పూర్తి చేయాలని, ప్రతి దశలో పారదర్శకతను పాటించాలని కోరారు. ఫారాల పంపిణీ సమయంలో ఓటర్లకు వాటిని సక్రమంగా ఎలా నింపాలో అవగాహన కల్పించాలని, అవసరమైన పత్రాలపై స్పష్టమైన సూచనలు ఇవ్వాలన్నారు. అదనపు కలెక్టర్ వెంట వనపర్తి, పెబ్బేరు తహసీల్దార్లు, సూపర్‌వైజర్లు, వార్డు అధికారులు, బీఎల్వోలు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్


