నల్లమలలో వేట! | - | Sakshi
Sakshi News home page

నల్లమలలో వేట!

Jun 30 2026 3:23 AM | Updated on Jun 30 2026 3:23 AM

ప్రజల సహకారం అవసరం..

అటవీ సంరక్షణలో ప్రజల సహకారం ఎంతో అవసరం. అడవిలోకి కొత్త వ్యక్తులు ప్రవేశించినా, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలి. కృష్ణానది తీరం వెంట బోటు పెట్రోలింగ్‌ చేస్తున్నాం. మన్ననూర్‌, లింగాల, కొల్లాపూర్‌లో సర్వేలెన్స్‌ టవర్స్‌ ఏర్పాటుచేశాం. సిస్టమ్‌ ద్వారా లైవ్‌లో పరిశీలించి మానిటరింగ్‌ చేపడుతాం. కెమెరా ట్రాప్‌ ద్వారా అటవీ జంతువుల కదలికలను పరిశీలిస్తున్నాం. వన్యప్రాణులను వేటాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం.

– రేవంత్‌చంద్ర, జిల్లా

అటవీశాఖ అధికారి

అచ్చంపేట: నల్లమలలో వేటగాళ్ల దాడులకు వన్యప్రాణులు బలవుతున్నాయి. అడవిలో నీరు దొరక్క బయటకొస్తున్న వాటిని కొందరు వేటాడి చంపేస్తున్నారు. మరికొందరు ఉచ్చులు బిగించి మరీ ప్రాణాలు తీస్తున్నారు. ఫలితంగా అటవీ సంపదకు నిలయంగా ఉన్న అనేక అరుదైన వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇటీవల అమ్రాబాద్‌ అభయారణ్యంలోకి మారణాయుధాలతో ప్రవేశించిన వేటగాళ్లను కెమెరా ట్రాప్‌ ద్వారా గుర్తించిన అటవీశాఖ అధికారులు.. నలుగురిని పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. 2024–25 సంవత్సరంలో వేటగాళ్లు ఏర్పాటుచేసిన 1,076 ఉచ్చులను హైదరాబాద్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో తొలగించారు. దీన్ని బట్టి నల్లమలలో వేట ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.

ప్రత్యేక నిఘా ఉన్నా..

నల్లమల అటవీ ప్రాంతంలో కెమెరా ట్రాప్‌లు, ప్రత్యేక నిఘా బృందాలున్నా వన్యప్రాణుల వేట మాత్రం ఆగడం లేదు. అభయారణ్యంలో నిత్యం ఏదో ఒకచోట వేట కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. వేటాడిన వన్యప్రాణుల మాంసంతో పచ్చళ్లు తయారుచేసి.. రహస్య మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు సమాచారం. ప్రతి ఏటా 15 నుంచి 20 వరకు వన్యప్రాణుల వేటపైనే అటవీశాఖ కేసులు నమోదు చేస్తోంది.

నీటి కోసం వచ్చి.. ఉచ్చులో చిక్కి

అటవీ ప్రాంతంలో ట్యాంకర్లు వెళ్లే ప్రాంతంలోనే నీటి వసతిని ఏర్పాటుచేశారు. కోర్‌ ఏరియాలో నీటి వసతి లేకపోవడంతో వన్యప్రాణులు దాహార్తిని తీర్చుకునేందుకు అడవి నుంచి బయటికి వస్తున్నాయి. ఈ క్రమంలో దారితప్పి వేటగాళ్ల ఉచ్చులో చిక్కుతున్నట్లు తెలుస్తోంది. అటవీ సరిహద్దు గ్రామాలైన సిద్ధాపూర్‌, మన్ననూర్‌, మద్దిమడుగు, బాణాల, బిల్లకల్లు, లక్ష్మీపల్లి, అప్పాయిపల్లి, ఎర్రపెంట, చెన్నంపల్లి, వట్టువర్లపల్లి, సార్లపల్లి, కుడిచింతలబైలు ఉడిమిళ్ల, మద్దిమడుగు, తిర్మలాపూర్‌ (బీకే) తదితర గ్రామాల్లోని వ్యవసాయ పొలాల్లో ఉండే బోరుబావుల వద్దకు దుప్పులు, ఎలుగుబంట్లు వస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అలాగే బల్మూర్‌ మండలం బిల్లకల్లు అటవీ ప్రాంతంలోని రుసుల చెరువులో కొద్దిపాటి నీరు ఉంది. వన్యప్రాణులు అక్కడికి అధికంగా వస్తుంటాయి.

ఏటీఆర్‌లో వన్యప్రాణులకు పొంచి ఉన్న ముప్పు

నిత్యం ఏదో ఒకచోట వేటాడుతున్న వైనం

కెమెరా ట్రాప్‌ల్లో చిక్కుతున్న వేటగాళ్లు

నీటి కోసం బయటికొచ్చి బలవుతున్న వన్యప్రాణులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement