‘బుద్దారం’ నిర్వాసితుల రాస్తారోకో | - | Sakshi
Sakshi News home page

‘బుద్దారం’ నిర్వాసితుల రాస్తారోకో

Jun 30 2026 3:23 AM | Updated on Jun 30 2026 3:23 AM

గోపాల్‌పేట: బుద్దారం గ్రామంలో నిర్మిస్తున్న రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న రైతులు, డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిర్మించుకొని డబ్బులు రాని గ్రామస్తులు సర్పంచ్‌ శేఖర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో సోమవారం ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ చెరువును రిజర్వాయర్‌గా మార్చే క్రమంలో ఇప్పటికే 101 ఎకరాలు కోల్పోయామని.. రెండో విడతలో మరో 101 ఎకరాలు సర్వే చేశారన్నారు. ప్రస్తుతం సర్వే చేసిన భూమిలో ఎకరా, అర ఎకరాలోపు ఉన్న రైతులే ఎక్కువగా ఉన్నారని.. ఆ భూములు రోడ్డుకు దగ్గరగా ఉండటంతో ఎకరాకు రూ.40 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే భూమికి బదులు వేరేచోట రెండింతల భూమి, ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని కోరారు. అలాగే నిర్వాసితులకు బ్యాంకుల్లో రాయితీ రుణాలిప్పించి స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించాలన్నారు. అలాగే గ్రామంలో గతంలో నిర్మించుకున్న 40 డబుల్‌ బెడ్రూం ఇళ్లకు రూ.ఐదు లక్షల చొప్పున చెల్లించాలని, ఇందుకోసం రెండేళ్లుగా అధికారులకు మొర పెట్టుకున్నా రావడం లేదని వాపోయారు. వెంటనే డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, తహసీల్దార్‌ తిలక్‌కుమార్‌రెడ్డి అక్కడకు చేరుకొని ఆందోళన విరమించాలని కోరగా అంగీకరించలేదు. అటుగా వెళ్తున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి వాహనాన్ని ఆపి గ్రామస్తులతో మాట్లాడారు. తప్పకుండా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement