సమన్వయంతోనే సమర్థ సేవలు | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతోనే సమర్థ సేవలు

Jun 30 2026 3:23 AM | Updated on Jun 30 2026 3:23 AM

వనపర్తి: జిల్లాలో న్యాయవ్యవస్థ, పోలీసుశాఖ, జిల్లా యంత్రాంగం సమష్టిగా పనిచేసి ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు కృషి చేద్దామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాకరాజు శ్రీనివాసరావు కోరారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరావును సోమవారం కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, ఎస్పీ సునీతారెడ్డి కోర్టు సముదాయంలోని ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు పరస్పర సమన్వయంతో పనిచేయాల్సిన అవసరంపై చర్చించారు. ముఖ్యంగా పోక్సో కేసుల విచారణను వేగవంతం చేసి బాధితులకు సకాలంలో న్యాయం అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు. న్యాయమూర్తులు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

జూలై 1 నుంచి ఈ–ఆఫీస్‌ అమలు..

జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయ మధ్య జరిగే అన్నిరకాల ఉత్తర ప్రత్యుత్తరాలు జూలై 1 నుంచి ఈ–ఆఫీస్‌ ద్వారా మాత్రమే జరగాలని.. అందుకు తగినట్లు అధికారులు, సిబ్బంది తగిన శిక్షణ తీసుకొని సమాయత్తం కావాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. సోమవారం ప్రజావాణి మందిరంలో ఈ–ఆఫీస్‌పై అధికారులకు అవగాహన కల్పించారు. ఫైళ్ల సత్వర పరిష్కారం, పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఈ–ఆఫీస్‌ ఉపయోగకరమైందని.. అంతేగాకుండా పర్యావరణ హితమని వివరించారు. ఏ ఫైల్‌ ఏ అధికారి, సిబ్బంది దగ్గర పెండింగ్‌లో ఉంది.. ఎన్నిరోజుల నుంచి ఉంది అనే విషయాలు సులువుగా తెలుస్తాయని చెప్పారు. జూలై 1 నుంచి తన వద్దకు ఫిజికల్‌గా వచ్చే ఏ ఫైల్‌ ఆమోదించబడదని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్‌, వినోద్‌కుమార్‌, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement