చుక్కల మందుకు చక్కటి స్పందన | - | Sakshi
Sakshi News home page

చుక్కల మందుకు చక్కటి స్పందన

Jun 29 2026 12:47 AM | Updated on Jun 29 2026 12:47 AM

తొలిరోజు 98.5 శాతం లక్ష్యం

చేరుకున్న జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ

పల్స్‌ పోలియో ప్రారంభించిన

కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌

పర్యవేక్షించిన జిల్లా వైద్యాధికారి

వనపర్తిటౌన్‌: జిల్లాలో ఆదివారం నిర్వహించిన పల్స్‌ పోలియో కార్యక్రమానికి చక్కటి స్పందన లభించింది. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు మొత్తం 46,150 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యాన్ని నిర్ధేశించుకోగా.. ఒక్కరోజే 45,848 మంది చిన్నారులకు వేసి 98.5 శాతం పూర్తి చేశారు. జిల్లావ్యాప్తంగా 367 కేంద్రాలు, ఒక మొబైల్‌ బృందం ఏర్పాటు చేశారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, అంగన్వాడీ, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు ఏఎన్‌ఎంలు, ఆశాలు, అంగన్‌వాడీ కార్యకర్తలు ఐదేళ్లలోపు చిన్నారులకు రెండు పోలియో చుక్కలు వేశారు. జిల్లాకేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, ఆర్టీసీ బస్టాండ్‌లోని మొబైల్‌ పాయింట్‌లో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, పీర్ల గుట్టలోని కేంద్రంలో స్థానికసంస్థల అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, నాగవరంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మధుసూదన్‌గౌడ్‌ ప్రారంభించారు. మదనాపురం మండలంలోని రైల్వేస్టేషన్‌ రోడ్‌ హైరిస్క్‌ ప్రాంతాల్లో పరిస్థితిని జిల్లా వైద్యాధికారి డా. సాయినాథ్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు.

విధిగా వేయించాలి..

ఐదేళ్లలోపు చిన్నారులకు విధిగా పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని ప్రతి చిన్నారికి వ్యాక్సిన్‌ వేయాలని, అందుకు తల్లిదండ్రులు సహకరించాలని సూచించారు. అదనపు కలెక్టర్లు వినోద్‌కుమార్‌, ఖీమ్యానాయక్‌, డీఎంహెచ్‌ఓ డా. సాయినాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలియో నిర్మూలనలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని, పోలియో బారిన పడకుండా ఉండేందుకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏ చిన్నారిని వదలకుండా పోలియో చుక్కలు వేసేలా ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. కేంద్రాలకు రాలేని చిన్నారులను గుర్తించి ఇంటింటికీ వెళ్లి వేయాలని ఆదేశించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement