వనపర్తిటౌన్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలన ప్రపంచానికే ఆదర్శమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కర్ణం పర్ణిత అన్నారు. జిల్లాకేంద్రంలోని నాగవరంలో నిర్మించిన బీజేపీ జిల్లా కార్యాలయాన్ని ఆదివారం హైదరాబాద్ నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వర్చువల్‌గా ప్రారంభించారు. జిల్లాకేంద్రంలో జరిగిన కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని ఆయన సందేశాన్ని ఎల్‌ఈడీ స్క్రీన్‌పై తిలకించారు. అనంతరం కర్ణం పర్ణిత కార్యాలయాన్ని రిబ్బన్ కట్‌చేసి ప్రారంభించి మాట్లాడారు. ప్రధాని మోదీ సామాన్యుల మొదలు దేశ భద్రత వరకు అన్నిరంగాల్లో సుస్తీర దేశంగా భారత్‌ను మలిచారని ఆమె కొనియాడారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటే బీజేపీ లక్ష్యమని, పశ్చిమ బెంగాల్ మాదిరిగానే తెలంగాణలో సైతం సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడానికి జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రాష్ట్రంలో ప్రారంభమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో బీఎల్‌ఏ–2గా పనిచేస్తున్న పార్టీ కార్యకర్తలు పూర్తిస్థాయిలో పర్యవేక్షణతో బాధ్యతలు నిర్వర్తించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నాయకత్వంలో బూత్‌స్థాయి కార్యకర్తలు, శక్తికేంద్రం ఇన్‌చార్జీలను మరింత బలోపేతం చేస్తూ పార్టీని గ్రామస్థాయి వరకు విస్తరించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. మోదీ 12 ఏళ్ల పాలనలో ప్రజా సంక్షేమం, దేశాభివృద్ధి ఊహించని స్థాయిలో జరిగి ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ, రాష్ట్ర నాయకులు ప్రభాకర్‌రెడ్డి, సబ్బిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీశైలం, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు పురుషోత్తం, కేతూరి బుడ్డన్న, రాష్ట్ర కిసాన్‌మోర్చా ఉపాధ్యక్షుడు అనుజ్ఞారెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శులు పెద్దిరాజు, శ్రీనివాస్‌గౌడ్, మహిళామోర్చా అలివేలు, మాజీ కౌన్సిలర్ సుమిత్రమ్మ, కుమారస్వామి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ భాశెట్టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


