వనపర్తి: తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఆదివారం తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన పల్స్‌పోలియో ర్యాలీని అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, వినోద్‌కుమార్‌తో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో చాలా ఏళ్ల క్రితమే పోలియో నిర్మూలన అయినప్పటికీ, పొరుగు దేశాల నుంచి వచ్చే వలసదారులతో మళ్లీ వ్యాప్తిచెందే అవకాశం ఉందని ప్రభుత్వం ముందస్తుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, దీంతో ఎలాంటి హాని ఉండదని వివరించారు. జిల్లాలో గుర్తించిన 46,150 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి 343 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి దాదాపు 1,300 మంది వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పుర చైర్‌పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్‌గౌడ్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. సాయినాథ్‌రెడ్డి, మార్కెట్‌యార్డ్ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, కౌన్సిలర్లు, వైద్యసిబ్బంది, ప్రజాప్రతినిధులు, అధికారులు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.


