● గత సీజన్‌లో 50.72 టీఎంసీలు..
ఈసారి 43.5 టీఎంసీల
నీటి ఎత్తిపోత
● 2016 నుంచి భారీగాపెరిగిన పంపింగ్
భారం పడుతున్నా తగ్గేదేలే.. రికార్డు స్థాయిలో కేఎల్‌ఐ నీటి పంపింగ్
కొల్లాపూర్: మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ఈసారి కూడా నీటి పంపింగ్ పెద్దమొత్తంలో జరిగింది. గత సీజన్‌లో 50.72 టీఎంసీల నీటిని ఎత్తిపోసి రికార్డు సృష్టించగా.. ఈసారి మాత్రం వేర్వేరు కారణాలతో 43.5 టీఎంసీలను ఎత్తిపోశారు. కానీ ఇది కూడా ప్రాజెక్టు స్థాయికి మించిన ఎత్తిపోతలే. సాగునీటికే కాకుండా తాగునీటికి కూడా ఎంజీకేఎల్‌ఐ మీదనే ఆధారపడటం.. ప్రాజెక్టులోని మూడు మోటార్లతోనే ఈస్థాయి ఎత్తిపోతలు జరగడం అద్భుతమని నీటిపారుదలశాఖ నిపుణులు చెబుతున్నారు.
మిషన్ భగీరథకు సైతం..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలోని పలు మండలాలకు తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ స్కీంకు కూడా కేఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారానే నీటి పంపింగ్ చేస్తున్నారు. ఎల్లూరు సమీపంలోనే మిషన్ భగీరథ స్కీం ఏర్పాటుచేశారు. ఇక్కడి నుంచే అన్ని ప్రాంతాలకు తాగునీరు సరఫరా అవుతోంది. ప్రతి సంవత్సరం మిషన్ భగీరథ కోసం 7 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారు.
ఎంజీకేఎల్‌ఐ ప్రాజెక్టు
రోజువారీగా
ఎత్తిపోస్తున్నాం..
వర్షాకాలంలో మినహాయిస్తే.. మిగతా కాలంలో ఎల్లూరు పంప్‌హౌజ్‌లోని మూడు మోటార్ల ద్వారా రోజువారీగా నీటిని పంపింగ్ చేస్తున్నాం. సాగునీటితో పాటు, మిషన్ భగీరథకు కూడా ఈ ప్రాజెక్టు ద్వారానే నీటిని ఎత్తిపోస్తున్నాం. దీంతో మోటార్లపై భారం పడుతోంది. అయినా తప్పడం లేదు. పాల మూరు ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతలు ప్రారంభమైతే కేఎల్‌ఐపై భారం తగ్గుతుంది. 2024 –25లో 50 టీఎంసీల నీటిని ఎత్తిపోయగా.. 2025–26 సీజన్‌లో 43.5 టీఎంసీల నీటిని ఎత్తిపోశాం. – లోకిలాల్‌నాయక్, డీఈఈ
ఒక్కో మోటారుతో
800 క్యూసెక్కులు..
ప్రాజెక్టు పరిధిలో ఎల్లూరు, జొన్నలబొగుడ, గుడిపల్లి గట్టు పంప్‌హౌజ్‌లు ఉన్నాయి. ఒక్కో పంపుహౌజ్‌లో 5 మోటార్ల చొప్పున ఏర్పాటు చేశారు. వీటిలో 4 మోటార్లు రెగ్యులర్ పంపింగ్ కోసం కాగా.. 1 మోటార్ స్పేర్‌లో ఉంచుతారు. 30 మెగావాట్ల సామర్థ్యం గల ఒక్కో మోటార్ ద్వారా రోజూ 800 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. కేఎల్‌ఐ ద్వారా కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని ఆయకట్టుకు సాగునీరు అందుతోంది.


