సాగునీటి వృథాకు అడ్డుకట్ట | - | Sakshi
Sakshi News home page

సాగునీటి వృథాకు అడ్డుకట్ట

Jun 27 2026 1:07 AM | Updated on Jun 27 2026 1:07 AM

అమరచింత: భూత్పూర్‌ రిజర్వాయర్‌ నుంచి అమరచింత పెద్ద చెరువుతో పాటు ఆత్మకూర్‌, మదనాపురం మండలాలకు సాగునీరు అందించే ప్రధాన ఎడమ కాల్వ డి–1 నుంచి డి–25 వరకు షట్టర్లను బిగించారు. దీంతో ఈసారి వానాకాలంలో కాల్వ ద్వార పారుతున్న సాగునీరు ఎక్కడా వృథా కాకుండా నేరుగా ఆయకట్టుతో పాటు అనుబంధ చెరువులను నింపేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. గతంలో కాల్వ వెంట ఉన్న తూములకు షట్టర్లు లేకపోవడంతో నీరు వృథా కావడంతో చివరన ఉన్న అమరచింత పెద్ద చెరువు వరకు పారక ఈ ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. అదేవిధంగా కాల్వలో ముళ్లపొదలు, పూడిక పేరుకుపోవడంతో ఎగువ నుంచి వచ్చే నీరు దిగువకు పారక కాల్వకు గండ్లు పడేవని ఆయకట్టు రైతులు తెలిపారు. ఏటా చివరన ఉన్న గ్రామాల రైతులు నీటికోసం కాల్వలో పొక్లెయిన్‌ సాయంతో ముళ్ల పొదలు తొలగించే వారు. ఈసారి తూముల వద్ద కొత్తగా షట్టర్లను బిగించడంతో చివరి ఆయకట్టు వరకు సకాలంలో నీరు చేరి సాగుకు ఉపయోగపడుతాయని అధికారులు అంటున్నారు.

డి–1 నుంచి డి–25 వరకు..

భూత్పూర్‌ రిజర్వాయర్‌ నుంచి అమరచింత పెద్ద చెరువు వరకు సుమారు 32 కిలోమీటర్ల పొడవున 42 గ్రామాలకు సాగునీరు అందించే విధంగా కాల్వ నిర్మించారు. కాల్వ వెంట నిర్దేశిత ఆయకట్టుకు సాగునీరు అందేవిధంగా రూ.20 లక్షలతో డి–1 నుంచి డి–25 వరకు ఉన్న తూములకు 25 చోట్ల షట్టర్లను బిగించారు. వర్షాకాలం, చలికాలంలో సైతం కాల్వ వెంట నీరు వృథాగా పారుతుండటంతో ఈసారి వేసవిలోనే షట్టర్ల ఏర్పాటు పనులు పూర్తి చేయడంలో అధికారులు సఫలీకృతులయ్యారు.

భూత్పూర్‌ ప్రధాన ఎడమకాల్వకు షట్టర్ల బిగింపు

రూ.20 లక్షలతో పూర్తయిన పనులు

32 కిలోమీటర్ల ప్రవాహం.. 32 వేల ఎకరాల ఆయకట్టు

32 వేల ఎకరాలకు సాగునీరు..

32 కిలోమీటర్ల పొడవున్న భూత్పూర్‌ రిజర్వాయర్‌ ఎడమ కాల్వ ద్వారా 32 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. మక్తల్‌ మండలంలోని 4 గ్రామాలు, నర్వలోని 14, అమరచింతలోని 12, ఆత్మకూర్‌లోని 7, మదనాపురం మండలంలోని రెండు, చిన్నచింతకుంట మండలంలోని ఒక గ్రామానికి సాగునీరు అందిస్తున్నారు. 12 ఏళ్లుగా సాగునీటిని పొందుతున్న ఆయకట్టు రైతులు నేరుగా తమ గ్రామాల చెరువులను నీటితో నింపుతూ పంటలు పండించుకుంటున్నారు. మరికొందరు నేరుగాా పిల్ల కాల్వలు తవ్వి వాటి ద్వారా సాగునీటిని మళ్లించుకొని వ్యవసాయం చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement