గిరిజనుల అభ్యున్నతికి పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

గిరిజనుల అభ్యున్నతికి పెద్దపీట

Jun 27 2026 1:07 AM | Updated on Jun 27 2026 1:07 AM

వనపర్తి: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కాలం నుంచి గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తోంది కేవలం కాంగ్రెస్‌పార్టీయేనని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఆశీర్వాదం స్వర్ణోత్సవ వేడుకల బస్సుయాత్ర సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 1976లోనే గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించి ప్రోత్సహించింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. రిజర్వేషన్లు కల్పించడంతో గిరిజన కుటుంబాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. నియోజకవర్గ పరిధిలోని గిరిజనులు ఉండే ప్రతి ఆవాస ప్రాంతంలో సేవాలాల్‌ ఆలయాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులు, సన్న బియ్యం, ఉచిత విద్యుత్‌, విద్యార్థులకు ఉన్నత విద్య, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రైతు భరోసా రాయితీపై అనేక పథకాలను గిరిజనులకు పూర్తిస్థాయిలో అందిస్తామన్నారు. శనివారం జిల్లాకేంద్రానికి ఇందిరమ్మ ఆశీర్వాద స్వర్ణోత్సవ వేడుకల బస్సు యాత్ర వస్తుందని.. పెద్దఎత్తున గిరిజన సోదరులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిరిజన నాయకులతో కలిసి బస్సుయాత్ర పోస్టర్లు ఆవిష్కరించారు.

నేడు పల్స్‌పోలియో అవగాహన ర్యాలీ

వనపర్తి విద్యావిభాగం: పల్స్‌ పోలి యో–2026పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు శనివారం ఉదయం 8 గంటలకు వనపర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల మైదానం నుంచి పల్స్‌ పోలియో అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. సాయినాథ్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ర్యాలీని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, ఎస్పీ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి జెండా ఊపి ప్రారంభిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, శాట్‌ చైర్మన్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌, డీఎంహెచ్‌వో, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి, వివిధ శాఖల జిల్లా అధికారులు, వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, నర్సింగ్‌ విద్యార్థులు పాల్గొననున్నారని చెప్పారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని.. ఐదేళ్లలోపు చిన్నారులకు విధిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఆదివారం నిర్వహించే పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా ప్రజలందరూ సహకరించాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement