అమరచింత:మండలంలోని కొంకన్వానిపల్లి గ్రామంలో ఉన్న గుడిమాన్ కుంట కట్టతో పాటు కుంటను రైతులు ధ్వంసం చేశారంటూ ఇరిగేషన్ ఏఈ ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ స్థలం తమదేనని.. తప్పుడు కేసు ఎలా పెడతారంటూ రైతులు అంకె వెంకటన్న, దండు శ్రీను, అంకె శ్రీను ఏఈ ఆంజనేయులు, వర్క్ ఇన్‌స్పెక్టర్ దామోదర్‌తో పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే వాగ్వాదానికి దిగిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. కొంకన్వానిపల్లికి చెందిన ముగ్గురు రైతులు గుడి మాన్ కుంటను అక్రమించుకునే యత్నం చేస్తూ కుంట కట్టను జేసీబీతో ధ్వంసం చేశారని ఏఈ తెలిపారు. కుంట పరిధిలో 18 ఎకరాల ఆయకట్టు ఉందని, ఇది తమ రికార్డులో ఏళ్ల తరబడి ఉండటంతో వాటి సంరక్షణ కోసం చర్యలు తీసుకుంటున్న సమక్షంలో ఈ వ్యవహారం మూడు రోజుల కిందట తమ దృష్టికి వచ్చిందన్నారు. దీంతో బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశామన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కుంటను ధ్వంసం చేయడ మే కాకుండా తమపై పరుష పదజాలంతో దూషించడంతో శుక్రవారం పోలీస్ స్టేషన్‌కు వెల్లి జరిగిన విషయాన్ని వెల్లడించామన్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఐ స్వాతి మాట్లాడుతూ.. విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
పోలీస్‌స్టేషన్‌లోనే ఇరిగేషన్
అధికారులతో రైతుల వాగ్వాదం


