ప్రవేశాలకు ఆసక్తి చూపుతున్న విద్యార్థులు
ఆరోతరగతిలో ప్రవేశానికి..
జిల్లావ్యాప్తంగా ఉన్న 15 కేజీబీవీల్లో ఆరోతరగతిలో చేరేందుకు 600 సీట్లు అందుబాటులో ఉండగా.. ఈ విద్యాసంవత్సరం ఇప్పటి వరకు 827 దరఖాస్తులు వచ్చినట్లు ఎస్‌ఓలు వెల్లడిస్తున్నారు. దరఖాస్తునకు నెలాఖరు వరకు గడువు ఉండగా.. తల్లిదండ్రులు లేని పిల్లలు, వలస కార్మికుల పిల్లలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు మొదటి ప్రాధాన్యతనిస్తూ త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకోనుంది. సర్కారు బడుల్లో బోధన సరిగా అందడం లేదని భావిస్తున్న గ్రామీణ ప్రజలు కేజీబీవీల్లో తమ పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. గడువు ముగిసే సమయానికి 1,200 వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులకు నివేదిస్తూ తుది నిర్ణయం వారిపైనే వదిలేస్తున్నారు.
ఇంటర్మీడియట్‌లోనూ..
పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థినులు ఇంటర్‌లో తమకు నచ్చిన కోర్సులో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొన్ని కేజీబీవీల్లో ఆంగ్ల మాధ్యమం ఉండగా.. మరికొన్ని కేజీబీవీల్లో తెలుగు మీడియం కొనసాగుతున్నాయి. విద్యార్థినులు అధికంగా ఎంపీసీ, బైపీసీ కోర్సులతో పాటు వృత్తివిద్య కోర్సు సీఈజీలో చేరేందుకు ఇష్టపడుతున్నారు. ఇప్పటికే ఆయా కేజీబీవీల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఇప్పటి వరకు 923 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
అమరచింత: జిల్లావ్యాప్తంగా 15 కేజీబీవీలు.. మూడు వేల సీట్లు ఉంటే ప్రస్తుతం 3,730 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారంటే ప్రవేశాలకు ఎంత మేర ఆసక్తి కనబరుస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది. ప్రశాంత వాతావరణంలో విద్యాబోధన, వసతుల కల్పన, పౌష్టికాహారం అందుతుండటంతో విద్యార్థినులు చక్కగా చదువుకుంటూ చక్కటి ఫలితాలు సాధిస్తున్నారు. పదో తరగతి వరకు అక్కడే చదువుకున్న బాలి కలకు ఇంటర్ విద్యను అభ్యసించే సదుపాయం కూడా ఆయా కేజీబీవీల్లో అందుబాటులో ఉంది. 6వ తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థినులు ఇంటర్ విద్య పూర్తి చేసుకొని బయటకు వచ్చే అవకాశం ఉండటం.. తల్లిదండ్రులు కూ డా తమ పిల్లల చదువుకు అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో కేజీబీవీలకు మునుపెన్నడూ లేనంతగా డిమాండ్ పెరిగింది.
‘ఒకప్పుడు అధ్యాపకులతో పాటు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటిస్తూ కేజీబీవీల్లో చేర్చాలంటూ విద్యార్థినుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ప్రవేశాలకు ప్రయత్నించేవారు. ప్రస్తుతం పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. పది, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తుండటంతో విద్యార్థినులతో పాటు వారి తల్లిదండ్రులు సైతం ప్రవేశాలకు ఆసక్తి చూపుతుండటంతో దరఖాస్తుల సంఖ్య ఆశించిన దానికన్న అధికంగా వస్తుండటమే ఇందుకు నిదర్శనం.’
జిల్లాలో 15 పాఠశాలలు.. 3,730 మంది విద్యార్థులు
అధిక ఉత్తీర్ణత, విద్యా ప్రమాణాలే కారణం
ఆరోతరగతిలో ప్రవేశాలకు 827 దరఖాస్తులు


