వనపర్తి: మత్తు రహిత సమాజ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్, అదనపు ఎస్పీ రాజేష్ మీనా కోరారు. నషా ముక్త్ భారత్ వారోత్సవాల్లో భాగంగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లాకేంద్రంలో యాంటీ డ్రగ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకు జరిగిన ర్యాలీని వారు జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులు, యువత, ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది అధికసంఖ్యలో పాల్గొని డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. రాజీవ్ కూడలిలో మానవహారం నిర్వహించి మాదక ద్రవ్యాలకు దూరం ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన యాంటీ డ్రగ్స్ ఫొటో పాయింట్, సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని డ్రగ్స్ నిర్మూలనకు తమ మద్దతు ప్రకటించారు. వారం రోజులుగా పాఠశాల, కళాశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువత డ్రగ్స్ అనే మహమ్మారికి దూరంగా ఉండాలని, ఒకసారి వ్యసనానికి బానిసైతే జీవిత లక్ష్యాలు, విలువలు, కుటుంబ బంధాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే ’నషా ముక్త్ భారత్’ లక్ష్యాన్ని విజయవంతం చేయగలమన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని.. స మాజం మొత్తం ఒక్కటిగా ముందుకొస్తేనే డ్రగ్స్ రహిత, ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించగలమని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, డీవైఎస్‌ఓ సుధీర్‌రెడ్డి, డీఐఈఓ నరేందర్‌కుమార్, జిల్లా సంక్షేమశాఖ అధికారి సుధారాణి, సీఐ రత్నం, పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్, షీటీం నార్కోటిక్ ఎస్‌ఐ అంజద్, ట్రాఫిక్ ఎస్‌ఐ సురేందర్, జి ల్లా బాలల పరిరక్షణ అధికారి రాంబాబు, జిల్లా సంక్షేమశాఖ సూపరింటెండెంట్ అరుంధతి, చైల్డ్ ప్రొటెక్షన్ డీసీపీయూ అధికారులు, వివిధ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, అధ్యాప కులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


