వైద్య విద్యార్థుల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

వైద్య విద్యార్థుల పాత్ర కీలకం

Jun 26 2026 7:27 AM | Updated on Jun 26 2026 7:27 AM

వనపర్తి: నషా ముక్త్‌ భారత్‌ లక్ష్య సాధనలో ప్రతి వైద్య విద్యార్థి ఒక చైతన్య దూతగా ముందుకు రావాలని ఎస్పీ డి.సునీతారెడ్డి అన్నారు. గురువారం జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో వనపర్తి ప్రభుత్వ వైద్య కళాశాలలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించగా.. ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై అదనపు ఎస్పీ రాజేష్‌ మీనాతో కలిసి వైద్య విద్యార్థులకు డ్రగ్స్‌తో కలిగే అనర్థాలు, నివారణలో యువత, వైద్యుల బాధ్యతలపై అవగాహన కల్పించారు. అనంతరం వైద్య విద్యార్థులు ‘మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటాం.. ఇతరులను కూడా దూరంగా ఉండేలా చైతన్యం కల్పిస్తాం‘ అంటూ ప్రతిజ్ఞ చేశారు. కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాంటీ డ్రగ్స్‌ ఫొటో పాయింట్‌ వద్ద ఎస్పీ, అదనపు ఎస్పీ, అధ్యాపకులు, విద్యార్థులు సందేశాత్మక ఫొటోలు దిగడంతో పాటు యాంటీ డ్రగ్స్‌ సంతకాల కార్యక్రమంలో పాల్గొని డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి తమ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వైద్య వృత్తి అత్యంత పవిత్రమైందని, గొప్ప లక్ష్యంతో ముందుకు సాగుతున్న మీరు ఎట్టి పరిస్థితుల్లో మాదక ద్రవ్యాలు, చెడు వ్యసనాలకు బానిస కాకుండా వైద్య విద్యను పూర్తిచేసి నైపుణ్యం కలిగిన వైద్యులుగా ఎదగాలని కోరారు. మాదక ద్రవ్యాలు వ్యక్తి ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. అతడి ఆశయాలు, కుటుంబం, భవిష్యత్‌ను నాశనం చేస్తాయని తెలిపారు. మంచి వైద్యుడు వ్యాధులను మాత్రమే కాదు.. సమాజంలోని చెడు వ్యసనాలను కూడా నిర్మూలించే దిశగా పని చేయాలన్నారు. విద్య కేవలం డిగ్రీ కోసమే కాదు.. సమాజ ఆరోగ్యాన్ని కాపాడే మహత్తర బాధ్యత కోసం అన్న విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ గిరిబాబు, వైద్య కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ జ్యోతిరెడ్డి, వైద్య కళాశాల ఆర్గనైజర్‌ డా. హరికృష్ణ, సీఐ రత్నం, పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్‌, నార్కోటిక్‌ ఎస్‌ఐ అంజద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement