కొత్తకో రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం పెద్దమందడిలోని బీసీ బాలుర సంక్షేమ వసతిగృహాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఇటీవల చేపట్టిన మరమ్మతులను పరిశీలించారు. విద్యార్థుల సంఖ్య, వసతిగృహ నిర్వహణపై ఆరా తీశారు. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వంటశాలను పరిశీలించి వంట గ్యాస్ కనెక్షన్ తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చూడాలని సిబ్బందికి సూచించారు. హాస్టల్‌కు ప్రహరీ నిర్మాణం అవసరమని సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ భవనాలు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు పరిశీలించారు. విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పాఠశాలకు అవసరమైన ఇతర మౌలిక వసతుల కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో భాగంగా పెద్దమందడిలో చేపట్టిన అవగాహన ర్యాలీని కలెక్టర్ పరిశీలించి, ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన..
మండలకేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. లబ్ధిదారు సుజాత షేర్‌వాల్ టెక్నాలజీతో నిర్మిస్తున్న గృహాన్ని సందర్శించి నిర్మాణ వ్యయం, పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. తక్కువ వ్యయంతో వేగంగా నిర్మాణం చేపట్టేందుకు ఈ సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సాంకేతికతను మరింత మంది లబ్ధిదారులకు చేరవేసి ప్రోత్సహించాలని ఎంపీడీఓను ఆదేశించారు. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో షేర్‌వాల్ టెక్నాలజీకి అవసరమైన అల్యూమినియం మెటీరియల్‌ను కొనుగోలు చేసి జిల్లాలో ఈ నిర్మాణ విధానాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలన్నారు. మరో ఇద్దరు లబ్ధిదారులు నాగమ్మ, కృష్ణయ్య ఇళ్లను సందర్శించి నిర్మాణ వ్యయం గురించి ఆరా తీశారు. ఆర్థిక ఇబ్బందులున్న లబ్ధిదారులను గుర్తించి మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించాలని ఎంపీడీఓను ఆదేశించారు. కలెక్టర్ వెంట హౌసింగ్ పీడీ విఠోభా, తహసీల్దార్ మల్లికార్జున, ఎంపీడీఓ పరిణత, ఎంఈఓ మంజులత, సర్పంచ్ నాగమ్మ, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.


