వనపర్తి: జిల్లాకేంద్రంలో వాహనాల రద్దీని నియంత్రించడం, ప్రమాదాలను నివారించడం, ప్రజలకు సులభమైన రాకపోకలు కల్పించడం పోలీసుశాఖ ప్రధాన లక్ష్యమని అదనపు ఎస్పీ రాజేష్ మీనా అన్నారు. ఎస్పీ సునీతారెడ్డి ఆదేశాల మేరకు బుధవారం ఆయన డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్‌తో కలిసి అంబేడ్కర్ చౌరస్తా, ఓల్డ్ యూకోబ్యాంక్ టర్నింగ్, గాంధీచౌక్, పాలిటెక్నిక్ కూడలి తదితర రద్దీ ప్రాంతాలను సందర్శించి ట్రాఫిక్ సమస్యలకు కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. రహదారుల విస్తరణ, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణలో అవసరమైన మార్పులు, హెచ్చరిక బోర్డుల ఏర్పాటు, ట్రాఫిక్ సిబ్బంది వినియోగం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. ట్రాఫిక్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వాహనదారులు తమ భద్రతతో పాటు ఇతరుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తప్పనిసరిగా రహదారి నియమాలు పాటించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్ట్ విధిగా ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడపొద్దని సూచించారు. అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నాయని పేర్కొన్నారు. నిర్ణీత పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనాలు నిలపాలని, రాంగ్ రూట్‌లో ప్రయాణించకూడదని సూచించారు. పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్, ట్రాఫిక్ ఎస్‌ఐ సురేందర్, పోలీసు సిబ్బంది ఉన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తి: జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో తాత్కాలిక పద్ధతిన ఉపాధ్యాయ/అధ్యాపక ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జోనల్ అధికారి విద్యుల్లత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలుర పాఠశాలలు/ కళాశాలలో జేఎల్ రసాయన శాస్త్రం–1, టీజీటీ హిందీ–2, టీజీటీ గణితం–1, పీజీటీ బయోసైన్‌న్స్–1, టీజీటీ బయోసైన్‌న్స్–1, పీజీటీ ఫిజికల్ సైన్‌న్స–1, టీజీటీ ఫిజికల్ సైన్స్–1, సోషల్ స్టడీస్–1.. అలాగే బాలికల పాఠశాలలు/కళాశాలలో పీజీటీ ఇంగ్లీష్–1, డిగ్రీ కళాశాలలో ఆంగ్లం–2, జంతుశాస్త్రం–1, రసాయన శాస్త్రం–1, మైక్రో బయోలజీ–1, కంప్యూటర్ సైన్‌న్స్–2, కామర్స్–1 ఖాళీలున్నాయని పేర్కొన్నారు. బాలికల పాఠశాల/ కళాశాలలో బోధించుటకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు 27వ తేదీలోగా జిల్లాకేంద్రం సమీపంలోని నాగవరంలో ఉన్న సాంఘిక సంక్షేమ కళాశాలలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఒరిజినల్, జిరాక్స్ విద్యార్హత ధ్రువపత్రాలతో డెమోకు హాజరుకావాలని సూచించారు.
పీజీ ఫలితాలు విడుదల
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలో పీజీ మొదటి సంవత్సరం పరీక్షల ఫలితాలను వీసీ శ్రీనివాస్ గురువారం విడుదల చేశారు. ఈ మేరకు ఎంబీఏ మొదటి సెమిస్టర్‌లో 42.1, ఎంసీఏ మొదటి సెమిస్టర్‌లో 34.8 ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం పీయూ వెబ్‌సైట్‌ను చూడాలని కంట్రోలర్ ప్రవీణ పేర్కొన్నారు.


