వనపర్తి: భవిష్యత్ తరాలపై బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి తగదని శాట్ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆరోపించారు. బుధవారం స్థానిక డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం విద్యకు కేటాయించిన బడ్జెట్ కంటే మూడురెట్లు ఎక్కువగా ఉన్నత విద్య పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కార్పొరేట్ విద్యాసంస్థలు దోచుకుంటున్నా.. ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం విగ్రహాలు, ఆలయాలు, గోపురాలు కట్టడం తప్పా.. గడిచిన దశాబ్ద కాలంలో విద్యాభివృద్ధికి చేసిన ఒక్క ఉన్నత నిర్ణయం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షల రద్దులు, ఉద్యోగ నియామకాల్లో జాప్యం, పెరుగుతున్న నిరుద్యోగం, విద్యావ్యవస్థలో నెలకొన్న వైఫల్యాలపై విద్యార్థులతో కలిసి పోరాటానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని.. ప్రశ్నాపత్రాల లీకేజీలతో విద్యార్థుల కష్టాన్ని వృథా చేయడంతో పాటు మనోవేదనకు గురిచేస్తున్నాయన్నారు. విద్యార్థుల భవిష్యత్, ఉద్యోగ అవకాశాలు, నాణ్యమైన విద్యవంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి యువత ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. నీట్ రద్దు.. రీ–నీట్ నిర్వహణపై ఇప్పటికే పార్టీలకు అతీతంగా విద్యార్థులు దేశ రాజధానిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారని గుర్తు చేశారు. దేశంలో భవిష్యత్ తరాల కోసం కృషి చేసిన నాయకుడు జవహర్‌లాల్ నెహ్రూ అని.. ఆయన పాలనలో ఎన్నో ఉన్నత విద్యాలయాలు, యూనివర్సిటీలు నెలకొల్పారన్నారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలు, శాస్త్రవేత్తలు, వైద్యులు, ఇంజినీర్లు భారత్‌లోని ఉన్నత విద్యాలయాల్లో చదువుకున్నవారేనని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాంకేతిక విద్య అవసరమని ముఽఖ్యమంత్రి ఆలోచించి ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్, స్కిల్ డెవలప్‌మెంట్, స్పోర్ట్స్ స్కూల్స్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. అనంతరం పార్లమెంట్ ఇన్‌చార్జ్ సిద్ధేశ్వర్‌తో కలిసి బీఎల్‌ఓ–2లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సర్‌పై అవగాహన కల్పించారు. సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సాయిచరణ్‌రెడ్డి, తిరుపతయ్య, జిల్లా ప్రధానకార్యదర్శి బ్రహ్మచారి, నాయకులు బి.కృష్ణ, ధనలక్ష్మి, సుఖేందర్‌రెడ్డి, వాల్యానాయక్, శరవంద, పాండుసాగర్, నందిమళ్ల చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.


