● దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి
మదనాపురం: వానాకాలం సాగుకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు నేరుగా రైతులకే అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విత్తనమేళాలు నిర్వహిస్తోందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి తెలిపారు. బుధవారం మండలకేంద్రంలోని రైతువేధికలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తనమేళాకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై రైతులకు విత్తనాలు పంపిణీ చేసి మాట్లాడారు. రైతులకు అవసరమైన విత్తనాలను ఒకేచోట అందుబాటులో ఉంచాలనే ఉద్ధేశంతోనే విత్తనమేళాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడులు సాధ్యమవుతాయని, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఆమోదించిన 7 రకాల సన్నరకం వరి విత్తనాలను రైతులకు అందజేశారు. వరితో పాటు ఉద్యాన పంటల సాగుపైనా రైతులు దృష్టి సారించాలని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ శారద రామకృష్ణ, మార్కెట్ చైర్మన్ పల్లెపాగ ప్రశాంత్, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, తహసీల్దార్ రాజు, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీఓ ప్రసన్నకుమారి తదితరులు పాల్గొన్నారు.


