రుణాలు మంజూరు చేయాలి
ఉపాధి కల్పనకు దోహదపడే పీఎంఈజీపీ, విశ్వకర్మ పథకాలకు సంబంధించి అర్హులకు రుణాలు మంజూరు చేసి ప్రోత్సహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన, పీఎం విశ్వకర్మ పథకం కింద పెండింగ్, తిరస్కరించిన దరఖాస్తులపై కలెక్టర్ బ్యాంకర్లు, దరఖాస్తుదారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల మాట్లాడుతూ.. జిల్లాలో పీఎంఈజీపీ పథకం కింద 28 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. 51 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని తెలిపారు. అలాగే ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద 76 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. 105 దరఖాస్తులు తిరస్కరించినట్లు వెల్లడించారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శివకుమార్, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జ్యోతి, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ అధికారి శశికుమార్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, దరఖాస్తుదారులు తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ ఆదర్శ్‌సురభి కోరారు. జూన్ 25 నుంచి ప్రారంభం కానున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ మంగళవారం సమావేశం నిర్వహించి, వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్‌ఓలు ఇంటింటికీ పంపిణీ చేస్తారన్నారు. రాజకీయ పార్టీల తరఫున నియమించిన బూత్ లెవల్ ఏజెంట్లు బీఎల్‌ఓలతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమం సజావుగా జరిగేలా సహకరించాలన్నారు. ఓటరు ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదు కావడం చట్టరీత్యా నేరమని, అలాంటి నమోదులను గుర్తించి తొలగించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ, ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని, సెప్టెంబర్ 28 వరకు వాటిని పరిష్కరించి అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి సూర్యప్రకాష్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, కొత్తగొల్ల శంకర్ (టీడీపీ), ఎ.గట్టుయాదవ్ (బీఆర్‌ఎస్), ఎంఏ రహీం (ఏఐఎంఐఎం), పుట్టా ఆంజనేయులు (సీపీఐ(ఎం)), పి.తిరుపతయ్య (ఐఎన్‌సీ), శ్రీనివాస్‌గౌడ్ (బీజేపీ), ఇతర ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
2కే రన్
ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఎస్‌ఐఆర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా కేంద్రంలో 2కే రన్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ఆదర్శ్ సురభి అదనపు ఎస్పీ రాజేష్ మీనాతో కలిసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. కార్యక్రమంలో సీపీఓ హరికృష్ణ, డీఎస్పీ గిరిబాబు, ప్రజాప్రతినిధులు, యువత పాల్గొన్నారు.


