గోపాల్‌పేట: రసాయన ఎరువులతో పండిన పంటలకు మార్కెట్‌లో విలువ తగ్గుతోందని.. ప్రకృతి వ్యవసాయం చేస్తే ఎంతో లాభదాయకమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి సూచించారు. బుధవారం మండలంలోని జయన్నతిర్మలాపూర్‌లో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. ఏళ్ల కిందట చూసుకుంటే దేశంలో పండించే పంటలకు ఎంతో విలువ ఉండేదని.. 200 రోజుల్లో పంట దిగుబడి వచ్చేదని సాంబార్, వరి వంగడాలు చాలా ఏపుగా పెరిగి దిగుబడి అధికంగా ఉండేదని వివరించారు. ప్రస్తుత సమయంలో దిగుబడి అధికంగా రావాలన్న ఉద్దేశంతో రసాయన ఎరువుల వినియోగం పెరగడంతో బయటి దేశాల్లో డిమాండ్ తగ్గిందని వివరించారు. రైతులు ఇప్పటికై నా రసాయన ఎరువులు తగ్గించి ప్రకృతి సేద్యంపై దృష్టి సారించాలని సూచించారు. ప్రస్తుతం గ్రామంలో 125 మంది ప్రకృతి వ్యవసాయం చేసేందుకు సానుకూలంగా ఉన్నారని.. రాబోయే కాలంలో ఈ సంఖ్య మరింత పెరగనుందని వివరించారు. అనంతరం రైతులకు ప్రకృతి వ్యవసాయ మిషన్ బ్యాగులు, క్యాలెండర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతి గోపాల్, టీపీసీసీ ప్రధానకార్యదర్శి నందిమళ్ల యాదయ్య, మండల ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, భాస్కర్‌రెడ్డి, కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.


