బ్యాంకర్లు లక్ష్యాన్ని చేరుకోవాలి : కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

బ్యాంకర్లు లక్ష్యాన్ని చేరుకోవాలి : కలెక్టర్‌

Mar 19 2026 10:31 AM | Updated on Mar 19 2026 10:31 AM

వనపర్తి: బ్యాంకర్లు 2025–2026 వార్షిక ఆర్థిక ప్రణాళిక లక్ష్యాన్ని ఛేదించాలని, ప్రతి ఖాతాదారుడికి ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కల్పించేందుకు కృషి చేయాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి బ్యాంకర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రూ.5,339.27 కోట్ల వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా డిసెంబర్‌ నాటికి రూ.3,326.61 కోట్లు సాధించారని, మార్చి 31లోపు వందశాతం పూర్తి చేయాలన్నారు. ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజనకు జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 72,162 మంది ఖాతాదారులు మాత్రమే బీమా తీసుకున్నారని ఆశ్ఛర్యం వ్యక్తం చేశారు. సమావేశంలో లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ శివకుమార్‌, రిజర్వ్‌ బ్యాంక్‌ ఎల్‌డీఓ చేతన్‌ గోరేకర్‌, నాబార్డ్‌ డీడీఎం మనోహర్‌రెడ్డి, యూబీఐ చీఫ్‌ మేనేజర్‌ ఆశిష్‌ రంజన్‌ బ్యాంకు మేనేజర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఏప్రిల్‌ మొదటి వారంలో నోటిఫికేషన్‌..

హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్యూమ్‌ టెక్నాలజీలో 2026–27 విద్యా సంవత్సరానికిగాను డిప్లొమా ఇన్‌ హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ టెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు ఏప్రిల్‌ మొదటి వారంలో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి తెలిపారు.

‘పది’ పరీక్ష కేంద్రాల తనిఖీ..

జిల్లాకేంద్రంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదోతరగతి పరీక్ష కేంద్రాన్ని బుధవారం కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి తనిఖీ చేశారు. 242 మంది విద్యార్థులకుగాను 242 మంది హాజరయ్యారని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఆయన వెంట జిల్లా విద్యాధికారి అబ్దుల్‌ ఘనీ, తహసీల్దార్‌ రమేష్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

ఆస్తిపన్ను వసూళ్లలో వేగం పెంచండి..

ఆస్తి, నీటి పన్ను వసూళ్లలో పుర కమిషనర్లు వేగం పెంచాలని, సిబ్బందికి ఎప్పటికప్పుడు మార్గనిర్ధేశకాలు ఇవ్వాలని కలెక్టర్‌ ఆదర్శ్‌సురభి అన్నారు. బుధవారం జిల్లాలోని పుర కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి మాట్లాడారు. పన్ను బకాయిలు ఉన్న వారి జాబితాను వార్డుల వారీగా సిద్ధం చేయాలని, జాబితాను కౌన్సిలర్లకు కూడా అందజేయాలన్నారు. డిజిటల్‌ పేమెంట్‌ చేయడానికి బార్‌కోడ్‌ ఉన్న నోటీసులను తయారుచేసి పోస్ట్‌లో పంపించాలని సూచించారు. ప్రతి మూడు వార్డులకు ఒక ప్రత్యేక అధికారిని నియమించి పర్యవేక్షణ చేపట్టాలన్నారు.

రివిజన్‌ మేళాల నిర్వహణ తప్పనిసరి..

అన్ని పురపాలికల్లో రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పన్ను వసూళ్లకు ప్రత్యేకంగా రివిజన్‌ మేళా నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్‌ ఆదేశించారు. మ్యుటేషన్లు, కొత్త ఇంటి నంబర్ల జారీ పనులు వేగంగా కొనసాగించాలన్నారు. పన్ను వసూళ్లపై రోజు పర్యవేక్షణ కొనసాగించి నివేదిక ఇవ్వాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌కు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement