● అధికారులు పని చేయకపోతే
సెలవుపై వెళ్లండి
● పుర అత్యవసర సమావేశంలో
ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తిటౌన్: తాగునీటి సరఫరాలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. అధికారులు ఏ విషయం అడిగినా పొంతన లేని సమాధానాలు, నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే ఉద్యోగం నుంచి తొలగించేంత వరకు వెనుకాడబోనని ఎమ్మెల్యే మేఘారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం పుర కార్యాలయంలో చైర్‌పర్సన్ ఎం.మాధవి అధ్యక్షతన తాగునీటి సరఫరాపై అత్యవసర సమావేశం నిర్వహించగా.. ఎమ్మెల్యే మేఘారెడ్డి హాజరై మాట్లాడారు. అధికారులు తాగునీటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తమ వద్దకు వచ్చే ప్రజలకు కౌన్సిలర్లు, తాను ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అలాగే ఇక్కడ పనిచేసిన అధికారి కార్యాలయంలో ఉండాల్సిన దస్త్రాలు తీసుకెళ్తే ఏం చేస్తున్నారని.. తక్షణమే కేసు నమోదు చేయాలని అధికారులకు సూచించారు. చార్జ్‌లిస్ట్ ఇవ్వకుండా వెళ్తే ప్రస్తుతం ఉన్న అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు పద్ధతి మార్చుకోకపోతే సెలవుపై వెళ్లాలని హితవు పలికారు. పుర చైర్‌పర్సన్ ఎప్పుడు కార్యాలయానికి వచ్చినా అధికారులు అందుబాటులో ఉండటం లేదని, కనీస సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని, ఆస్తిపన్ను వసూలు వివరాలు ఆమెకు తెలియజేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా పుర కార్మికులను డ్రైవర్లుగా, ఇంట్లో పని మనుషులుగా, ఫాంహౌస్‌లో పనిలో పెట్టుకుంటే చర్యలు తప్పవని, ఎక్కడ పని చేయాల్సిన వాళ్లు అక్కడే పని చేయాలన్నారు. కాంట్రాక్టర్లు ఎవరెవరు ఎంత పని చేశారు? ఏ మేరకు పనులు పెండింగ్‌లో ఉన్నాయి అనే విషయాలను సోమవారంలోగా తనకు అందించాలని ఆదేశించారు. తాగునీటి సరఫరాలో ఎక్కడ ఏ సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామని, క్షేత్రస్థాయిలో అవసరమైన ప్రతిపాదనలు కౌన్సిలర్లు ఇవ్వాలన్నారు. మోటార్ల మరమ్మతుకు ముగ్గురు కాంట్రాక్టర్లను ఏర్పాటు చేయాలని, ప్రతి 11 వార్డులకు ఒకరికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని కోరారు.


