వనపర్తి రూరల్: రైతులు తమ పొలాల వెంట ఉన్న గ్యాస్ పైప్‌లైన్ దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి రైతులకు సూచించారు. బుధవారం మండలంలోని పెద్దగూడెం శివారులో హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) ఇంటర్మీడియట్ పిగ్గింగ్ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆఫ్‌సైట్ మాక్‌డ్రిల్‌కు ఆయనతో పాటు కంపెనీ డీజీఎం అనూజ్ బురోనియా, ఆపరేషన్ మేనేజర్ శశిధర్‌రెడ్డి పాల్గొన్నారు. పైప్‌లైన్ మార్గంలోని గ్రామాల పరిధిలో ఎక్కడైనా పొరపాటున గ్యాస్ లీకేజీ ఏర్పడితే భారీ నష్టం జరగకుండా ఏ విధంగా నివారించాలనే విషయాలను కంపెనీ బృందాలు మాక్‌డ్రిల్ ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పైప్‌లైన్ కేవలం 1.5 మీటర్ల లోతులో ఉంటుందని.. ఎల్పీజీ గ్యాస్ పైపులైన్ చుట్టూ 18 మీటర్ల పరిధిలో ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదని సూచించారు. పొలాల్లో పైప్‌లైన్ ఏ మార్గంలో ఉందో తెలిసి ఉండాలన్నారు. లీకేజీని గుర్తిస్తే సమీపంలోని సైన్‌బోర్డుపై రాసిన నంబర్‌కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వం తరఫున కూడా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. రైతులు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించి ప్రమాదాలను నివారించేందుకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా వైద్యాధికారి డా. సాయినాథ్‌రెడ్డి, డీసీఎస్‌ఓ కాశీవిశ్వనాథ్, సర్పంచ్ పుష్పలత, అసిస్టెంట్ మేనేజర్ విద్యాసాగర్ గుప్తా, కృష్ణ, విజయ్, పవన్‌కుమార్, భారతి, ఫైర్ అధికారులు పాల్గొన్నారు.


