బైపాస్‌పై ఆశలు | - | Sakshi
Sakshi News home page

బైపాస్‌పై ఆశలు

Mar 17 2026 8:52 AM | Updated on Mar 17 2026 8:52 AM

జడ్చర్ల: జడ్చర్లకు బైపాస్‌ మంజూరుపై ఆశలు చిగురిస్తున్నాయి. జడ్చర్ల పట్టణ ట్రాఫిక్‌ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రతిపాదించిన బైపాస్‌ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. నిత్యం ట్రాఫిక్‌ సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా కేంద్రం పంపే కబురు కోసం ఎదురుచూస్తున్నారు. జడ్చర్ల పట్టణం చుట్టూ బైపాస్‌ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు రంగం సిద్ధం అయ్యింది. రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉన్న జడ్చర్ల పట్టణం గుండా ప్రయాణం నరకప్రాయంగా మారింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారు జడ్చర్ల దాటితే సరి అన్న ఆందోళనలో ప్రయాణాలు సాగిస్తున్నారు. పట్టణ విస్తీర్ణం కూడా అడ్డదిడ్డంగా ఉండడంతోపాటు పట్టణంలోని ప్రధాన రహదారులు ఇరుగ్గా ఉన్నాయి. ఇక్కడ వాహనాల రాకపోకలకు.. రహదారుల వెడల్పునకు ఎక్కడా పొంతన లేక అడుగడుగునా ట్రాఫిక్‌తో నిత్యం సతమతమవుతున్నారు. మరోవైపు జాతీయ రహదారి–44, ఇంకోవైపు ఎన్‌హెచ్‌–167తోపాటు రాష్ట్రీయ రహదారులు సైతం పట్టణం నడిబొడ్డుగుండా వెళ్తున్నాయి. వీటికి తోడు రైల్వే మార్గం కూడా ఉండడంతో రాకపోకలు అంత సునాయసంగా ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. రైల్వే మార్గం కారణంగా రెండు ప్రాంతాల రాకపోకలు సిగ్నల్‌గడ్డ వద్ద ఉన్న సింగిల్‌ బ్రిడ్జి మీదుగా మాత్రమే దాటే పరిస్థితి ఉండడంతో ఇక్కడ ట్రాఫిక్‌ స్తంభించి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. అలాగే జడ్చర్ల కొత్త బస్టాండ్‌ సమీపంలో ఎన్‌హెచ్‌–44పై ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి దగ్గర సైతం ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతాయి. ఇలా అనేక దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలతోపాటు ఇతర ప్రాంతాల ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో జడ్చర్లకు బైపాస్‌ రోడ్డు నిర్మిస్తే బాగుంటుందని ఎంతో కాలంగా ప్రజలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి పాలకవర్గాల నుంచి అనుకూల ప్రకటనలు రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్రాఫిక్‌తో సతమతం..

జడ్చర్ల మీదుగా ఒక్క హైదరాబాద్‌కు మాత్రమే కాకుండా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, మహారాష్ట్ర తదితర ఉత్తర, దక్షిణ భారతం వైపు భారీ సంఖ్యలో రాకపోకలు సాగుతుంటాయి. అయితే ఆయా ప్రాంతాలకు వెళ్లాలంటే జడ్చర్ల పట్టణం గుండానే అది కూడా సింగిల్‌ రోడ్డుగా ఉన్న ఒక చిన్నపాటి రైల్వే వంతెనపైనే రాకపోకలు సాగించే పరిస్థితి ఉండేది. కాగా ఇటీవల జాతీయ రహదారి–167 విస్తరణ పనులలో భాగంగా ఒకవైపు సింగిల్‌ బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేయగా.. మరోవైపు బ్రిడ్జి విస్తరణ పనులు నిలిచిపోవడంతో గుంతలమయంగా మారిన రహదారిపైనే రాకపోకలు సాగుతున్నాయి. వనపర్తి, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి ప్రాంతాలకు సైతం ఇదే రహదారి కీలకంగా ఉంది. జాతీయ, అంతర్రాష్ట్ర రహదారులు సిగ్నల్‌గడ్డ మీదుగానే సాగుతుండడంతో నిత్యం ట్రాఫిక్‌ రద్దీ ఉంటుంది. దీంతో గంటల తరబడి రాకపోకలకు అంతరాయం కలుగుతుండడంతో ప్రజలు బైపాస్‌ రోడ్డు కోసం ఎదురుచూస్తున్నారు.

జడ్చర్ల పట్టణం వ్యూ

ఈ నెలాఖరులోగా..

జడ్చర్ల పట్టణంలో ట్రాఫిక్‌ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బైపాస్‌ రోడ్డు నిర్మాణం చేయాలన్న డిమాండ్‌ గత కొన్నేళ్లుగా ఉంది. అయితే గత బీఆర్‌ఎస్‌ పాలనలో బైపాస్‌ రోడ్డుకు అప్పటి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రతిపాదించినా కార్యాచరణ రూపొందలేదు. తాజాగా ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి జడ్చర్ల బైపాస్‌ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీకి ప్రతిపాదించడంతో అడుగులు ముందుకు పడుతున్నాయి. ఈ నెలాఖరులోగా బిడ్డింగ్‌ ఓపెన్‌ చేసి డీపీఆర్‌ బాధ్యతలను అప్పగించే సూచనలు కనిపిస్తుండటంతో ఈ నెలాఖరులోగా డీపీఆర్‌ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

జడ్చర్ల బైపాస్‌తోపాటు జాతీయ రహదారి–167కి సంబంధించి రెండు వరుసలుగా ఉన్న రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించాలన్న ప్రతిపాదనలకు కూడా డీపీఆర్‌ చేయనున్నారు. దీనికి సంబంధించి జడ్చర్ల మండలంలోని జాతీయ రహదారి–167ని అనుసరించి నక్కలబండతండా మీదుగా మల్లెబోయిన్‌పల్లి, చిట్టింబోయిన్‌పల్లి మధ్యగా జాతీయ రహదారి–44 మీదుగా మరికల్‌, నాగసాల గ్రామాల సమీపం నుంచి చర్లపల్లి మీదుగా ఆల్వాన్‌పల్లి, గంగాపూర్‌ గ్రామాల పరిధిలోని జాతీయ రహదారి–167ని తాకేలా ప్రతిపాదనలు నివేదించారు. అయితే డీపీఆర్‌ ఆయా ప్రతిపాదనల మేరకే చేపడుతారా.. మరేమైనా కొత్తవి తెరపైకి వస్తాయా అన్నది వేచిచూడాల్సి ఉంది.

డీపీఆర్‌కు రంగం సిద్ధంతో ముందడుగు

ఈ నెలాఖరులోగా కొలిక్కి వచ్చే అవకాశం

పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యలకు శాశ్వత పరిష్కారం

అన్నీ సవ్యంగా జరిగితే జడ్చర్ల మరింత అభివృద్ధి

సమాచారం అందింది..

జడ్చర్లకు బైపాస్‌ నిర్మాణంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుంది. ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ నుంచి డీపీఆర్‌ తయారీ టెండర్లకు సంబంధించి సమాచారం అందింది. బైపాస్‌తో జడ్చర్లలో ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఎంపీ డీకే అరుణ సహకారంతో బైపాస్‌ సాధనకు చిత్తశుద్ధితో కృషిచేస్తాం.

– అనిరుధ్‌రెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement