● బాలికా విద్యకు ప్రోత్సాహం అందించాలి
● కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి: మహిళలు అన్ని రంగాల్లో రాణించి అందరికీ ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. సోమవారం ఐడీఓసి సమావేశ మందిరంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఎస్పీ సునీతారెడ్డితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే సమాజం నిజమైన అభివృద్ధి చెందినట్లు అని అన్నారు. మహిళలకు ఆరోగ్యం ఎంతో కీలకమని.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అదే విధంగా సమాజంలో బాల్యవివాహాల నిర్మూలనకు నడుం బిగించాలన్నారు. బాల్యంలోనే వివాహం చేయకుండా వారిని ఉన్నత చదువులు చదివించాలని, విద్యతోనే అందరికీ సమాజంలో గౌరవం పెరుగుతుందని తెలియజేశారు. చదువులో బాలికల డ్రాప్ అవుట్ కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బాలికా విద్యను ప్రోత్సహించి బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన వనజ, రాములమ్మలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎస్పీ సునీతారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళల భద్రతకు ఎంతో కృషి చేస్తుందన్నారు. పోలీస్‌శాఖలో మహిళా ఉద్యోగుల పాత్ర పెరిగిందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన మహిళా ఉద్యోగులు, మంచి ప్రతిభ కనబరిచిన మహిళలను కలెక్టర్, ఎస్పీ శాలువాతో సత్కరించి మెమోంటోలు అందజేశారు.
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు..
ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యనాయక్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయొద్దన్నారు. కాగా, ప్రజావాణి కార్యక్రమంలో 34 దరఖాస్తులు వచ్చాయని కార్యాలయ సిబ్బంది తెలిపారు.
జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన టౌన్ హాల్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయాన్ని కలెక్టర్ పరిశీలించారు. వాటిని వినియోగంలోకి తెచ్చే దిశగాా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. టౌన్ హాల్ నిర్మాణానికి నిధులు ఉన్నప్పటికీ పనులు ముందుకు సాగకపోవడంపై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పెండింగ్ పనులను వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్ విభాగాలు సమన్వయంతో పనిచేసి.. నెల రోజుల్లోగా వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు. అదే విధంగా నూతన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ సముదాయాన్ని కూడా ఏప్రిల్ 1వ తేదీలోగా వినియోగంలోకి తెచ్చే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ తరలింపునకు నూతన ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లో కావాల్సిన సౌకర్యాలను సమకూర్చుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో జిల్లా సంక్షేమశాఖ అధికారిణి సుధారాణి, డీఆర్డీఓ ఉమాదేవి, జీసీడీఓ శుభలక్ష్మి, ఆర్డీఎస్ అధ్యక్షురాలు చిన్నమ్మ తామస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ వైస్‌చైర్మన్ మధుసూదన్ గౌడ్, ఆర్‌ఎంఓ రెడ్డి కుమారి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


