అమరచింత: కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలపేతం చేయడానికే నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని డీసీసీ అధ్యక్షుడు, శాట్ చైర్మన్ శివాసేనారెడ్డి అన్నారు. సోమవారం అమరచింతలోని పార్టీ కార్యాలయ ఆవరణలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిది కేశం నాగరాజ్‌గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండలస్థాయి సమావేశానికి డీసీసీ అధ్యక్షుడు హాజరై మాట్లాడారు. మునుపెన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ, మండల అధ్యక్షులకు మరిన్ని అధికారాలు కల్పించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కార్యాచరణ రూపొందించారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని.. గ్రామాల్లో సర్పంచులతో పాటు పార్టీ అధ్యక్షుడికి సైతం అదే స్థాయిలో అధికారాలు కట్టబెట్టేందుకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామంలో ఎవరికి అందించాలనే పూర్తి స్వేచ్ఛ గ్రామ పార్టీ అధ్యక్షుడికి అప్పగిస్తున్నామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ.. పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమించే నాయకుడిని అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని సూచించారు. అనంతరం నాగరాజ్‌గౌడ్ మాట్లాడుతూ.. పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే ఉపేక్షించేది లేదన్నారు. వారిని పార్టీ నుంచి బయటికి పంపిస్తామన్నారు. గత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా పనిచేసిన వారిపై చర్యలు తప్పవన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ జింక సువర్ణ రవి, వైస్‌చైర్‌పర్సన్ రాధ అరుణ్, పార్టీ నాయకులు మహేందర్‌రెడ్డి, అరుణ్‌కుమార్, కమలాకర్‌గౌడ్, రవికాంత్, శ్యామ్, లక్ష్మీకాంత్‌రెడ్డి, తౌఫిక్, హనుమంతు నాయక్ పాల్గొన్నారు.


