పాన్‌గల్: దేశంలో నెలకొన్న వంటగ్యాస్ కొరతను నివారించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్ అన్నారు. దేశంలో వంటగ్యాస్ కొరత, ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులపై సోమవారం పాన్‌గల్‌లోని అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంటగ్యాస్ సంక్షోభం నుంచి దేశ ప్రజలను రక్షించడంపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వంటగ్యాస్ కొరతను నివారించాలని.. లేనిచో ప్రజలతో కలిసి గ్యాస్ గోదాంలను ముట్టడిస్తామని హెచ్చరించారు. కాగా, మండలంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మంగళవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి బాల్యానాయక్, వెంకటయ్య, భగత్, సర్పంచులు నిరంజన్, జంబులయ్య, ఉపసర్పంచ్ బాలునాయక్, రాము, దేవేందర్, కమలాకర్ పాల్గొన్నారు.


