హైరానా..! | - | Sakshi
Sakshi News home page

హైరానా..!

Mar 16 2026 8:54 AM | Updated on Mar 16 2026 8:54 AM

జూరాల వద్ద హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణంపై గందరగోళం

గద్వాల: కృష్ణానదిపై నిర్మించిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు సేఫ్టీని కాపాడాలి.. ఈ మేరకు డ్యాంకు సమీపంలో మరో బ్రిడ్జి నిర్మించాలన్న వాదన బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో జూరాల వద్ద హై లెవెల్‌ బ్రిడ్జి నిర్మాణంపై గందరగోళం నెలకొంది. ఇదే అంశంపై ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో సైతం చర్చ జరగడం.. దీనిపై సమగ్ర వివరాలను ఆ శాఖ అధికారులు మంత్రికి నేరుగా వివరించడం.. ఎంపీ డీకే అరుణ డ్యాం సేఫ్టీని కాపాడాలని సమీక్షలో గట్టిగా కోరడం వంటి పరిణామాలతో సమగ్ర పరిశీలనకు ఆ శాఖ కార్యదర్శి త్వరలోనే జూరాలకు రానున్నారు. దీంతో ప్రస్తుతం గద్వాల మండలం కొత్తపల్లి– ఆత్మకూరు మధ్యలో నిర్మించనున్న హై లెవెల్‌ బ్రిడ్జి భవితవ్యం గందరగోళంగా మారింది. ఇదే క్రమంలో ఈ బ్రిడ్జి నిర్మాణంపై ఇరిగేషన్‌ అధికారులు నిరభ్యంతర ధ్రువపత్రం ఇవ్వడానికి మల్లగుల్లాలు పడుతుండటం పెద్దఎత్తున చర్చకు దారితీసింది.

భద్రతే.. ప్రధానం

2021–డ్యాం సేఫ్టీ చట్టం ప్రకారం ఎక్కడైనా పాజెక్టుకు సంబంధించి డ్యాం భద్రతే ప్రధానం. అయితే జూరాల డ్యాం సేఫ్టీకి సంబంధించిన బ్రిడ్జి సమీపంలో కాకుండా డ్యాంకు దూరంగా నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించి సర్వే, టెండర్లు పూర్తయ్యి సివిల్‌ పనులు సైతం మొదలయ్యాయి. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం డ్యాం సేఫ్టీ చట్టానికి విరుద్ధంగా ఉంది. ఈ చట్టం ప్రకారం డ్యాం సేఫ్టీ పర్యవేక్షణ బాధ్యత ఇరిగేషన్‌ శాఖదే. వరద వచ్చే ముందు, వరద వచ్చిన తర్వాత డ్యాం భద్రతపై సమగ్ర నివేదిక ఇరిగేషన్‌ అధికారులు ఇవ్వాల్సి ఉంటుంది. దీని కారణంగానే హై లెవెల్‌ బ్రిడ్జి నిర్మాణంపై ఇరిగేషన్‌ శాఖ అధికారులు ఎన్‌ఓసీ (నిరభ్యంతర ధ్రువపత్రం) ఇవ్వడానికి తర్జనభర్జన పడుతున్నారు.

స్థల మార్పిడి కారణంగా..

వాస్తవానికి చాలాకాలంగా జూరాల డ్యాం భద్రతను దృష్టిలో ఉంచుకుని డ్యాంకు సమీపంలో అదనంగా బ్రిడ్జి నిర్మించాలని అధికారులు రూ.వంద కోట్లతో అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే గతేడాది వానాకాలంలో జూరాల గేట్ల రోపులు తెగిపోయి ప్రాజెక్టుకు ముప్పు పొంచి ఉందని మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జూరాలను సందర్శించారు. ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం రూ.వంద కోట్లతో నూతనంగా మరో బ్రిడ్జి నిర్మి స్తామని ప్రకటించారు. ఇందుకు గతంలో ఇరిగేషన్‌శాఖ అధికారులు నివేదించిన స్థలంలో కాకుండా గద్వాల మండలం కొత్తపల్లి– ఆత్మకూరు మండలం జూరాల మధ్యలో హై లెవెల్‌ బ్రిడ్జి నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు పనులు సైతం మొద లు కాగా.. తాజాగా వివాదం చెలరేగింది.

డ్యాం స్టేఫీ ప్రధానం అంటున్న ఇరిగేషన్‌ అధికారులు

ఎన్‌ఓసీ ఇచ్చేందుకు మల్లగుల్లాలు

మూడు, నాలుగు రోజుల్లో రానున్న ఆ శాఖ కార్యదర్శి

పైపెచ్చు ఆర్‌అండ్‌బీ నిర్మించే బ్రిడ్జిపై అభ్యంతరం లేదని స్పష్టీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement